Headlines

Andhra Pradesh: దూసుకొస్తున్న గండం.. ఏపీలో సోమవారం వాతావరణం ఎలా ఉంటుంది..?


Andhra Pradesh: దూసుకొస్తున్న గండం.. ఏపీలో సోమవారం వాతావరణం ఎలా ఉంటుంది..?

ఏపీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది.. వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ – ఉత్తర ఒడిశా తీరప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి స్పష్టమైన అల్పపీడనంగా కొనసాగుతోంది. ఇది రాబోయే 24 గంటల్లో వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో వాయవ్య, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంతో పాటు ఉత్తరాంధ్ర తీరప్రాంతాల్లో మంగళవారం వరకు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. సముద్రం తీవ్ర అలజడిగా మారి అలలు భారీగా ఎగసిపడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన వారు తక్షణమే తీరానికి చేరుకోవాలని సూచించారు.

రానున్న రెండు రోజుల వర్ష సూచన

సోమవారం పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పోలవరం, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం, మార్కాపురం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురుస్తాయి.

మంగళవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, వర్షం, పిడుగులు పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఆశ్రయం పొందవద్దని అధికారులు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *