Headlines

‘5వ అటెంప్ట్‌లో క్లియర్ అవుతుందా లేదా అనే ఎమోషన్స్ పక్కన పెట్టి.. నా పని నేను చేశా..’ IAS అఖిల్ సక్సెస్ జర్నీ | I Set Aside the Emotions of Whether I’d Clear or Not: Akhil Buddhi Secures UPSC AIR 321 in 5th Attempt


తెలంగాణకు చెందిన అఖిల్ బుద్ధి తన UPSC ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. మూడో ప్రయత్నంలోనే ఎంపికైనప్పటికీ నాలుగో ప్రయత్నంలో ఇంటర్వ్యూ దశలో విఫలమయ్యారు. ఆ సమయంలో ఆయనకు కేవలం 12 మార్కుల తేడాతో విజయం దూరమైంది. ఆ వైఫల్యం తన జీవితంలో అత్యంత బాధాకరమైన సందర్భాల్లో ఒకటని అఖిల్ గుర్తుచేసుకున్నారు. అయితే ఆ సమయంలో తండ్రి తనతో ఉండటంతో తాను ఏడవలేకపోయానని చెప్పారు. ‘నేను ఏడిస్తే మా నాన్న కూడా ఏడుస్తాడు. అందుకే ఫలితాలు వచ్చిన రోజు ఏడవలేదు. కానీ లోపల మాత్రం చాలా బాధ ఉండేది’ అని అఖిల్ ఓ ఇంటర్వ్యూలో తన యూపీఎస్సీ జర్నీ తెలిపారు.

ప్రిలిమ్స్‌కు మూడు రోజుల్లోనే హాజరు

నాలుగో ప్రయత్నం ఫలితం వచ్చిన మూడు, నాలుగు రోజులకే తదుపరి ప్రిలిమ్స్ పరీక్ష ఉండటంతో అఖిల్ పరీక్షకు హాజరయ్యారు. ప్రశ్నలు రాస్తున్న సమయంలో కూడా కళ్లలో కన్నీళ్లు వచ్చేవని, వాటిని ఆపుకుంటూనే పరీక్ష రాశానని తెలిపారు. అయితే తన స్థాయికి తగ్గట్టు ప్రిలిమ్స్ బాగా రాయలేదని ఆయనకు తెలుసు. అయినప్పటికీ కట్‌ఆఫ్‌ను క్లియర్ చేస్తాననే నమ్మకం మాత్రం ఉందన్నారు. కొన్ని రోజుల తర్వాత తన బాధను తండ్రి ముందు వెళ్లగక్కినట్లు చెప్పారు. ఇంటి పక్కన ఉన్న వేపచెట్టు దగ్గర తండ్రిని గట్టిగా పట్టుకుని ఏడ్చానని ‘ప్రిలిమ్స్ కూడా సరిగ్గా రాయలేదు బాపు. అని చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. తండ్రి మాత్రం ‘క్లియర్ అవ్వదా?’ అని ప్రశ్నించగా.. ‘అవుతుంది’ అని అఖిల్ సమాధానం ఇచ్చారు. ‘మరి ఎందుకు ఏడుస్తున్నావు?’ అని అడిగినప్పుడు.. ‘నాకు సంతృప్తి లేదు’ అని చెప్పినట్లు తెలిపారు.

ఆ తర్వాత భావోద్వేగాలను పక్కన పెట్టి పరీక్ష

అనంతరం ప్రిలిమ్స్ ఫలితాల్లో తాను ఉత్తీర్ణుడైనట్లు తెలియడంతో తల్లిని పట్టుకుని చాలా సేపు ఏడ్చానని అఖిల్ చెప్పారు. నాలుగో ప్రయత్నంలో ఏడవలేకపోయిన బాధ ఆ సమయంలో బయటకు వచ్చిందన్నారు. ‘ఒక్కసారి ఏడ్చిన తర్వాత పరీక్షల నుంచి నా ఎమోషన్స్‌ను పూర్తిగా తీసేశాను. క్లియర్ అవుతుందా, అవ్వదా అనే విషయం గురించి ఆలోచించలేదు. ఈసారి మెయిన్స్ ఎలాంటి ఎమోషన్స్ లేకుండా రాశాను. ఇంటర్వ్యూను కూడా అలాగే ఎదుర్కొన్నాను. అదే క్లిక్ అయింది’ అని అఖిల్ వివరించారు. అఖిల్ విజయంలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆయన మెయిన్స్ స్కోర్‌లో పెద్దగా మార్పు లేదు. 2020లో తన మెయిన్స్ స్కోర్ 769 కాగా, 2021లో ర్యాంక్ వచ్చినప్పుడు కూడా మెయిన్స్‌లో 769 మార్కులే వచ్చాయని చెప్పారు. ఈసారి కూడా మెయిన్స్ స్కోర్ 769గానే ఉందన్నారు. అయితే అసలు మార్పు ఇంటర్వ్యూలో వచ్చింది. గతంలో ఇంటర్వ్యూలో 143 మార్కులు సాధించిన అఖిల్.. ఈసారి ఏకంగా 195 మార్కులు సాధించారు. ఈ భారీ మార్పే ర్యాంకులో దాదాపు 200 స్థానాల మెరుగుదలకు కారణమైందని తెలిపారు.

ఇవి కూడా చదవండి



143 నుంచి 195కి.. ఇంటర్వ్యూ స్కోర్ ఎలా పెరిగింది?

ఇంటర్వ్యూ మార్కులు ఎందుకు పెరిగాయో తనకు పూర్తిగా తెలియదని అఖిల్ చెప్పారు. అయితే UPSC కోసం చేసిన ప్రయాణంలో ప్రజలతో మాట్లాడటం, వారి సమస్యలను తెలుసుకోవడం, వారికి ఎదురయ్యే ఇబ్బందులను అర్థం చేసుకోవడం తన ఆలోచనా విధానాన్ని మార్చి ఉండొచ్చని భావిస్తున్నారు. ‘నేను ప్రజలతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకున్నాను. వారికి పరిష్కారాలు ఏంటి అనే దానిపై ఆలోచించాను. నా పర్స్పెక్టివ్ మారింది. బహుశా అందుకే ఇంటర్వ్యూ స్కోర్ 143 నుంచి 195కి పెరిగి ఉండొచ్చు. అని ఆయన తెలిపారు.

ఒక్క మాక్ ఇంటర్వ్యూతోనే.. 195 మార్కులు

2023లో కేవలం ఒక్క మాక్ ఇంటర్వ్యూకే హాజరయ్యానని అఖిల్ చెప్పారు. అది కూడా అసలు ఇంటర్వ్యూకు రెండు రోజుల ముందు ఢిల్లీలో నిర్వహించిన మాక్ అని తెలిపారు. ఎలాంటి ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ప్రిపరేషన్ లేకుండానే స్నేహితులతో చర్చించి వెళ్లి ఇంటర్వ్యూ ఇచ్చినట్లు చెప్పారు. అదే ప్రయత్నంలో తనకు 195 మార్కులు రావడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. తనకు మార్కులు ఇచ్చిన బోర్డు సాధారణంగా అభ్యర్థులకు ఎక్కువ మార్కులు ఇవ్వలేదని, ఆ బోర్డు నుంచి 195 రావడం వల్ల తనలో వ్యక్తిత్వపరమైన లోపం లేదనే నమ్మకం వచ్చిందని అఖిల్ తెలిపారు. గతంలో ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు రావడంతో తన వ్యక్తిత్వంలోనే ఏదైనా లోపం ఉందా అనే సందేహం కలిగేదని అఖిల్ చెప్పారు. తాను మృదువుగా మాట్లాడే వ్యక్తినని, నవ్వుతూ మాట్లాడతానని తెలిసినా తక్కువ మార్కులు ఎందుకు వస్తున్నాయో అర్థం కాక చాలా ఆలోచించేవాడినని తెలిపారు. ఈసారి 195 మార్కులు రావడంతో గతంలో తాను సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోయాననే విషయం స్పష్టమైందన్నారు.

321వ ర్యాంక్ సాధించిన అఖిల్‌కు త్వరలో సర్వీస్ అలొకేషన్ జరగనుంది. కొన్ని సర్టిఫికెట్ అంశాల కారణంగా ఐఏఎస్ కేటాయింపుపై కొంత చర్చ జరుగుతున్నప్పటికీ.. తదుపరి ఏడు, ఎనిమిది రోజుల్లో సర్వీస్ అలొకేషన్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. క్యాడర్ అలొకేషన్ మాత్రం డిసెంబర్‌లో నిర్ణయించే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో హోమ్ స్టేట్ క్యాడర్ వచ్చే అవకాశాలపై స్పందిస్తూ.. అక్కడ ఒక్క ఖాళీ మాత్రమే ఉందని, అది ఎస్టీ కేటగిరీకి వెళ్లిందని చెప్పారు. అందువల్ల ఏ రాష్ట్రం వచ్చినా సంతోషంగా స్వీకరిస్తానన్నారు. ఢిల్లీకి వెళ్లి అక్కడ సర్వైవ్ అవుతున్నానంటే ఎక్కడైనా సర్వైవ్ అవ్వగలను. తెలంగాణ కాకుండా ఏ రాష్ట్రం వచ్చినా నాకు ఓకే. ఏపీ వచ్చినా ఇంటికి రావడానికి ఒక రోజు పడుతుంది. ఢిల్లీ నుంచి వచ్చినా ఒక రోజే పడుతుంది. కాబట్టి రాష్ట్రం గురించి నేను వర్రీ అవ్వడం లేదు అని అఖిల్ చెప్పారు. పోస్టింగ్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులను తనతో తీసుకెళ్తారా అనే ప్రశ్నకు అఖిల్ ఆసక్తికరంగా స్పందించారు. ‘నేను ఐఏఎస్ అయ్యాను కాబట్టి నాతో వచ్చేయండి అని వారిని అడగను. వాళ్లు నాతో ఉండాలనుకుంటున్నారా, లేక తమ దగ్గరే ఉండాలనుకుంటున్నారా అనేది వాళ్ల నిర్ణయం. నాతో రావాలనుకుంటే చాలా సంతోషంగా తీసుకెళ్తాను. అక్కడే ఉండాలని అనుకుంటే నేను వస్తూ పోతూ ఉంటాను’ అని చెప్పారు.

ఇంత సుదీర్ఘమైన UPSC ప్రయాణంలో ప్రేమలో పడలేదా అనే ప్రశ్నకు అఖిల్ సరదాగా స్పందించారు. ‘నా ప్రేమ ఇప్పటికే ఉంది. అది UPSC’ అని చెప్పారు. తాను UPSCలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఒక తరం నుంచి మరో తరానికి కుటుంబాన్ని ఒక మెట్టు పైకి తీసుకెళ్లే లక్ష్యంతో పోరాడుతున్నానని వివరించారు. అఖిల్ తన కుటుంబ నేపథ్యాన్ని కూడా వివరించారు. తన తాత మరణించే సమయానికి ఆయన దగ్గర రూ.1,000 కూడా పొదుపు లేదని చెప్పారు. అక్కడి నుంచి తన తండ్రి కష్టపడి కుటుంబాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు. మా నాన్న ఆ స్థాయి నుంచి కుటుంబాన్ని నిర్మించి తన కొడుకును ఐఏఎస్ చేసే స్థాయికి తీసుకొచ్చారు. మరి నేను ఏం చేయాలి? నా పిల్లలకు, మనవళ్లకు, నా చుట్టూ ఉన్నవారిని ఒక మెట్టు పైకి తీసుకెళ్లాలి. ఇప్పుడు నేను చేస్తున్నది రాబోయే నాలుగు తరాలపై ప్రభావం చూపుతుంది అని అఖిల్ తెలిపారు. అందుకే తనకు UPSC ఒక తరాల పోరాటంగా అనిపిస్తుందని చెప్పారు.

తన స్నేహితులు ప్రేమ, వివాహం గురించి అడుగుతుంటారని అఖిల్ చెప్పారు. అయితే ప్రస్తుత దశలో ప్రేమ తన లక్ష్యానికి డిస్ట్రాక్షన్‌గా మారే అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలిపారు. ‘ప్రేమ వస్తే ఆమె నాకు మద్దతు ఇవ్వొచ్చు, నన్ను అర్థం చేసుకోవచ్చు. జీవితం మరింత సులభం కావచ్చు. కానీ అది ఒక రిస్క్ కూడా. ఈ పోరాటంలో ఆ రిస్క్ తీసుకోగలను అనిపించడం లేదు’ అని చెప్పారు. అయితే భవిష్యత్తులో జీవిత భాగస్వామి గురించి తన ఆలోచనలు కూడా మారుతున్నాయని అఖిల్ తెలిపారు. 2021లో తనకు ఒక అమ్మాయి వస్తే ఆమెను బేబీలా చూసుకోవాలి, ఆమెను రక్షించాలి అనుకునేవాడినని.. కానీ ఇప్పుడు జీవిత భాగస్వాముల మధ్య పరస్పర సహకారం, ఒకరికొకరు అండగా నిలబడటం కూడా అవసరమని అర్థమైందన్నారు. కొన్ని సందర్భాల్లో నేను కూడా ఆమె ముందు బేబీలా ఉండాలి. నాకు ఆమె రక్షణ, ఆమె తోడు అవసరమయ్యే సందర్భాలు ఉంటాయి. నా ఆలోచనలు ఇంకా పరిణామం చెందుతున్నాయి అని అఖిల్ చెప్పారు.

వైఫల్యాలను విజయానికి మెట్లుగా మార్చుకున్న అఖిల్

వరుస ప్రయత్నాలు, ఇంటర్వ్యూ వైఫల్యాలు, భావోద్వేగ ఒత్తిడి.. ఇవన్నీ దాటుకుని అఖిల్ చివరకు 321వ ర్యాంక్ సాధించారు. ముఖ్యంగా మెయిన్స్ స్కోర్‌లో పెద్ద మార్పు లేకపోయినా ఇంటర్వ్యూలో 143 నుంచి 195కి మార్కులు పెంచుకోవడం ఆయన విజయ ప్రయాణంలో కీలక మలుపుగా నిలిచింది. ‘క్లియర్ అవుతుందా లేదా అనే భావోద్వేగాన్ని పక్కన పెట్టి, నా పని నేను చేయాలి’ అనే దృక్పథమే తన విజయానికి కారణమైందని అఖిల్ ప్రయాణం చెబుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *