Headlines

WhatsApp: వాట్సప్‌లో ఆధార్, పాన్, బ్యాంక్ స్టేట్‌మెంట్ పంపుతున్నారా..? వామ్మో.. మీరు పెద్ద ప్రమాదంలో ఉన్నట్లే.. | WhatsApp Alert: Never Share Aadhaar, PAN or Bank Statements Without Checking These Safety Risks


స్మార్ట్‌ఫోన్ ఉన్నవారు తప్పనిసరిగా వాట్సప్ వాడుతూ ఉంటారు. చాటింగ్‌తో పాటు డాక్యుమెంట్లు సులువుగా పంచుకోవచ్చు. ఫైల్ అప్‌లోడ్ చేస్తే సెకన్లలోనే రిసీవర్‌కు వెళుతుంది. దీంతో వాట్సప్‌ను డాక్యుమెంట్లు పంపుకునేందుకు ఎక్కువమంది ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వ్యక్తిగత డాక్యుమెంట్లు వాట్సప్‌లో పంపించుకునే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధార్, పాన్, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు షేర్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మీ వ్యక్తిగత వివరాలు ఇతరుల చేతికి వెళ్లడం ద్వారా అనేక ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీరు ఎవరితోనైనా పంచుకోవాలనుకున్నప్పుడు పంపించడం సురక్షితమా.. కాదా అనేది తనిఖీ చేసుకోవాలి.

ఆధార్, పాన్ పంపుతున్నారా..?

మీరు ఇతరులకు ఆధార్, పాన్, బ్యాంక్ స్టేట్‌మెంట్స్ లాంటి సున్నితమైన పత్రాలను పంపినప్పుడు అవి వారి ఫోన్, ల్యాప్‌టాప్ లేదా క్లౌడ్ బ్యాకప్‌లో సేవ్ అయి ఉంటాయి. దీని వల్ల మీ పత్రాలతో మోసాలకు పాల్పడవచ్చు. ఇతరులు దానిని తమ ఫోన్‌లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్‌గా క్లౌడ్‌లో స్టోర్ కావొచ్చు. లోన్ ఏజెంట్ లేదా హోటల్‌లో ధృవీకరణ కోసం మాత్రమే వారికి పంపుతున్నామని మీరు అనుకుంటారు. కానీ వారి ఫోన్‌లో అది సేవ్ అయి ఉండటం వల్ల మీ డేటాపై పూర్తి నియంత్రణను కోల్పోతారు. ఆర్ధిక రంగంలో డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్లకు పెద్ద నెట్‌వర్క్ ఉంది. ఈ ఏజెంట్లు వినియోగదారులను కనుక్కొనివారికి రుణాలు మంజూరు అయ్యేలా చేయడంలో సహాయపడతారు. బ్యాంకింగ్ సంస్థ అధికారిక వ్యవస్థల ద్వారా కాకుండా వ్యక్తి పర్సనల్ ఫోన్ నెంబర్‌కు కేవైసీ పత్రాలను పంపడం వల్ల ఇబ్బందులు ఎదురుకావొచ్చు.

తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి..

మీ పత్రాల ఆధారంగా నకిలీ పత్రాలను కూడా సృష్టించవచ్చు. తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి మీ వ్యక్తిగత సమాచారం వెళితే.. అవాంఛిత కాల్స్, సందేశాల కోసం ఒక విలువైన ఆధారంగా మారుతుంది. అత్యంత దారుణమైన సందర్భాల్లో ఇది గుర్తింపు దొంగతనానికి దారితీయవచ్చు. వాట్సప్‌లో పంపే మార్గం కాకుండా వ్యాపార సంస్థలు తమ సొంత డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ ఏర్పాటు చేసుకోవాలి. లేదా డిజిలాకర్, యూఐడీఏఐ లాంటి ఫ్లాట్‌ఫామ్స్ ద్వారా ఆటోమేటిక్ వెరిఫికేషన్ జరిగేలా చర్యలు తీసుకోవాలి. సంస్థలు ప్రజల వ్యక్తిగత డేటాను ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగించాలి. డేటాను బాధ్యతాయుతంగా నిర్వహించాలి. మీరు ఎవరి ఫోన్‌కైనా మీ పాన్, ఆధార్ లేదా బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను వాట్సాప్‌లో షేర్ చేసేటప్పుడు.. ఒక్కసారి ఆలోచించుకోండి. దానికి బదులుగా అధికారిక కంపెనీ లింక్‌ను లేదా సురక్షితమైన డాక్యుమెంట్ అప్లోడ్ పోర్టల్‌ను పంపమని అడగండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *