ఛైల్డ్ ఆర్టిస్టుగా వెండితెరకు పరిచయమైంది మీనా. ఆ తర్వాత హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళం తదితర భాషల్లో వందలాది సినిమాలు చేసింది. తన అందం, అభినయంతో తిరుగులేని హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రజనీ కాంత్, మమ్ముట్టి, మోహన్‌లాల్ లాంటి దక్షిణాది స్టార్ హీరోలతో జోడి కట్టింది మీనా. స్టార్ హీరోయిన్ గా సుమారు మూడు దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలింది. సినిమాల సంగతి పక్కన పెడితే.. విద్యాసాగర్ అనే వ్యాపార వేత్తను వివాహం చేసుకుంది మీనా. వీరికి నైనికా అనే పాక కూడా ఉంది. ఎంతో ఆనందంగా సాగుతోన్న మీనా జీవితంలో పెద్ద కుదుపు భర్త హఠాన్మరణం. 2022లో విద్యాసాగర్ కన్నుమూశారు. అయితే మీనా భర్త మరణం గురించి పలు పుకార్లు వచ్చాయి. కరోనా చికిత్స కారణంగా విద్యా సాగర్ చనిపోయారని, అలాగే పావురాల వ్యర్థాల కారణంగా ఆయన కన్నుమూశారని ఇలా రకరకాల వార్తలు వినిపించాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మీనా తన భర్త మరణంపై స్పందించింది. ఆయనను కాపాడుకునేందుకు తాను చేయని ప్రయత్నం లేదంటూ ఎమోషనల్ అయ్యింది.
‘నిజం చెప్పాలంటే మా ఆయలనకు లంగ్ ట్రాన్స్ ప్లాంట్ చేయాల్సింది. అప్పటివరకు ఇది చాలా పెద్ద ప్రక్రియ అని మాకు తెలియదు. ఇందులో ఉండే మెడికల్ ప్రాసెస్ చూసి నేనే చాలా ఆశ్చర్యపోయాను. చాలా రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగడంతో మా ఆయన ఆరోగ్యం క్షీణించింది. కొద్ది రోజులకు మా ఆయన శరీరం ఎలాంటి ట్రీట్మెంట్ కు సహకరించలేదు. హైదరాబాద్, బెంగళూర్.. ఇలా ఇండియా మొత్తం లంగ్స్ కోసం ట్రై చేశాను. చివరకు మెడికల్ ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళదామన్న ఆలోచన కూడా వచ్చింది. అక్కడ మాకు బంధువులు ఉన్నారు. అందులో డాక్టర్స్ కూడా ఉన్నారు. కానీ వారు కూడా అమెరికా వచ్చినా ఇక్కడి ట్రీట్మెంటే అక్కడ కూడా జరుగుతుందన్నారు. అందులోనూ ఇలాంటి పరిస్థితుల్లో షఫ్లింగ్ చేయడం బాగుండదని సలహా ఇచ్చారు. ఇండియాలోనే ఉండాలని, బెస్ట్ ట్రీట్మెంట్ కోసం ట్రై చేయాలని సూచించారు. చాలా సార్లు లంగ్స్ ట్రాన్స్ ప్లాంట్ కు అలెర్ట్స్ కూడా వచ్చాయి. కానీ అది మ్యాచ్ అవ్వాలి.. ఇది మ్యాచ్ అవ్వాలి అంటూ చాలా మెడికల్ క్రైటీరియా ఉంది ఈ ప్రాసెస్ లో. మూడు నాలుగు సార్లు ట్రాన్స్ ప్లాంట్ కు వెళ్లి మ్యాచ్ అవ్వలేదని వెనక్కు వచ్చిన సందర్బాలు ఉన్నాయి. అదే సమయంలో ఈ పరిస్థితి నాకు, మా కుటుంబ సభ్యులకు చాలా కొత్త. ఎలా ఫేస్ చేయాలో అర్థం కాలేదు. ఆయనను కాపాడుకోవడానికి శతవిధాలా ప్రయత్నించాం. కానీ దురదృష్టవశాత్తూ ఆయన మాకు దూరమైపోయారు. నా భర్త కన్నుమూసిన తర్వాత చాలా కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాను. ఇప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయితే నా ఫ్రెండ్స్, సినిమాలతో ఈ విషాదం నుంచి కోలుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చారు మీనా.
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి