Headlines

కొమురవెల్లి భక్తులకు గుడ్‌న్యూస్.. మల్లన్న దర్శనం ఇక మరింత సులభం..! | Komuravelli Railway station to be inaugurated by Union Minister Kishan Reddy on July 26

కొమురవెల్లి భక్తులకు గుడ్‌న్యూస్.. మల్లన్న దర్శనం ఇక మరింత సులభం..! | Komuravelli Railway station to be inaugurated by Union Minister Kishan Reddy on July 26


తెలంగాణలోని ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న ఆలయానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు శుభవార్త. కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్‌ను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి జూలై 26న అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

కొమురవెల్లి మల్లన్న ఆలయాన్ని సందర్శించే భక్తుల సౌకర్యార్థం, మనోహరాబాద్–సిద్దిపేట కొత్త రైల్వే మార్గంలో (మనోహరాబాద్–కొత్తపల్లి రైలు మార్గం ప్రాజెక్టులో భాగంగా) ఈ నూతన రైల్వే స్టేషన్‌ను నిర్మించారు. సుమారు రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ స్టేషన్‌లో హై లెవెల్ ప్లాట్‌ఫారమ్, ప్లాట్‌ఫారమ్ షెల్టర్, ప్రయాణికుల వేచి ఉండే గది, తాగునీటి సౌకర్యం, విద్యుత్ దీపాలు, ఇతర ప్రాథమిక వసతులను కల్పించారు. భక్తులు, ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించేలా ఆధునిక ప్రమాణాలతో స్టేషన్‌ను అభివృద్ధి చేశారు.

ప్రస్తుతం సికింద్రాబాద్–సిద్దిపేట మధ్య నాలుగు డెమూ రైళ్లు నడుస్తుండగా, వాటికి కొమురవెల్లి పుణ్యక్షేత్రం స్టేషన్‌లో అదనపు స్టాపేజీ కల్పించారు. ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇతర ప్రముఖులతో కలిసి సిద్దిపేట–సికింద్రాబాద్ డెమూ రైలు నంబర్ 77654ను కొమురవెల్లి పుణ్యక్షేత్రం స్టేషన్ నుంచి జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైలు సేవలు హైదరాబాద్ మహానగరంతో ప్రాంతీయ అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, భవిష్యత్తులో ఇతర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులకు కూడా ప్రయోజనం చేకూర్చనున్నాయి.

ప్రతి సంవత్సరం మల్లన్న బ్రహ్మోత్సవాలు, జాతరల సందర్భంగా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు కొమురవెల్లికి తరలివస్తుంటారు. ఇప్పటి వరకు రోడ్డు మార్గంపైనే ఆధారపడాల్సి వచ్చిన భక్తులకు రైల్వే స్టేషన్ అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణం మరింత సులభం కానుంది. ప్రయాణ సమయం, ఖర్చు తగ్గడంతో పాటు భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యం లభించనుంది.

అంతేకాకుండా ఈ స్టేషన్ భక్తులకు మాత్రమే కాకుండా సిద్దిపేట పరిసర ప్రాంతాల ఉద్యోగులు, విద్యార్థులు, స్వల్ప దూర ప్రయాణికులకు కూడా ఎంతో ఉపయోగపడనుంది. రైల్వే అనుసంధానం వల్ల ఆధ్యాత్మిక పర్యాటకానికి కొత్త ఊపు లభించడంతో పాటు స్థానిక వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు, ప్రాంతీయ సామాజిక-ఆర్థిక అభివృద్ధికి కూడా ఇది దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ ప్రారంభంతో తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రానికి మరో కీలక మౌలిక వసతి అందుబాటులోకి వచ్చినట్లవుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *