Headlines

పాక్‌ ఐఎస్‌ఐ ఏజెంట్లను పట్టించిన సోషల్ మీడియా పోస్ట్.. ఢిల్లీలో దంపతుల అరెస్ట్..! | Delhi couple arrested for spying for Pakistan ISI, sent SIM cards, sensitive information to Pak


న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్‌ (ISI) గూఢచర్య నెట్‌వర్క్‌‌ను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఛేదించింది. ఈ నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై ఢిల్లీకి చెందిన సాహిల్‌ (25), అతని భార్య సమీరా (21)ను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పెద్ద ఎత్తున సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాహిల్‌కు 2024లో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అనంతరం ఆ పరిచయం గూఢచర్య కార్యకలాపాలకు దారితీసినట్లు దర్యాప్తులో తేలింది. సాహిల్‌, సమీరా పాకిస్థాన్‌లోని హ్యాండ్లర్లతో సంప్రదింపులు జరుపుతూ భారతదేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని చేరవేసేందుకు సహకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

పాక్‌కు 8 భారతీయ సిమ్ కార్డులు?

2024-25 మధ్య ఈ దంపతులు ఎనిమిది భారతీయ సిమ్ కార్డులను సేకరించి, వాటిని దుబాయ్ మీదుగా పాకిస్థాన్‌కు పంపినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇందుకు గాను వారికి సుమారు రూ.30 వేల వరకు నగదు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ సిమ్‌లతో పాకిస్థాన్‌లో వాట్సాప్ ఖాతాలను యాక్టివేట్ చేసి, భారతీయులను సంప్రదించేందుకు ఉపయోగించినట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా కొన్ని ఖాతాల ద్వారా భారతీయ వాట్సాప్ గ్రూపుల్లోకి ప్రవేశించి సమాచారం సేకరించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు.

సైనిక ప్రాంతాలపై రెక్కీ..!

సాహిల్‌కు భారతదేశంలోని వివిధ కంటోన్మెంట్ ప్రాంతాలను పరిశీలించడం, గూఢచర్య కార్యకలాపాలకు అవసరమైన సమాచారాన్ని సేకరించడం, ఇతర వ్యక్తులను నెట్‌వర్క్‌లోకి తీసుకురావడం వంటి బాధ్యతలు అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు. కోర్ట్‌ మార్షల్‌ ఎదుర్కొంటున్న సైనిక సిబ్బందికి సంబంధించిన సమాచారాన్ని కూడా సాహిల్‌ అందించినట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. సాహిల్‌ను ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్ ప్రాంతంలో తొలుత అరెస్టు చేసిన పోలీసులు.. అతని మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్‌గా పరిశీలించారు. అందులో పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్లతో జరిగిన సంభాషణలు లభించినట్లు తెలిపారు. వాటి ఆధారంగా సమీరా పాత్రను గుర్తించి ఆమెను కూడా అరెస్టు చేశారు.

నిందితుల నుంచి రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వాటిలోని డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తున్నారు. ఈ నెట్‌వర్క్‌కు ఇంకా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి? ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయి? మరెవరైనా ఇందులో భాగస్వాములయ్యారా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *