హైదరాబాద్‌లో సబర్బన్ రైలు ప్రయాణాన్ని మరింత విస్తరించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక అడుగు వేసింది. ఇటీవల అందుబాటులోకి వచ్చిన సీతాఫల్‌మండి – లాలాగూడ కార్డ్‌లైన్ కారణంగా కాచిగూడ నుంచి చెర్లపల్లి, ఘట్‌కేసర్ వరకు ఎంఎంటీఎస్ రైళ్లను నడిపే అవకాశాలు మెరుగయ్యాయి. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే నగర తూర్పు ప్రాంతాలకు తొలిసారిగా కాచిగూడ నుంచి నేరుగా ఎంఎంటీఎస్ సేవలు లభించనున్నాయి. ప్రస్తుతం కాచిగూడ నుంచి బయలుదేరే రైళ్లు విద్యానగర్, జామై ఉస్మానియా మీదుగా సీతాఫల్‌మండి చేరుకుని, అక్కడి నుంచి కొత్త కార్డ్‌లైన్ ద్వారా లాలాగూడ వైపు మళ్లే అవకాశం ఏర్పడింది. అనంతరం మౌలాలి మీదుగా చెర్లపల్లి టెర్మినల్, అక్కడి నుంచి ఘట్‌కేసర్ వరకు రైళ్లు నడిపేలా రైల్వే అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ కారిడార్ అందుబాటులోకి వస్తే పోచారం ఐటీ హబ్, ఘట్‌కేసర్ పరిసరాలు, చెర్లపల్లి పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే వేలాది మంది ఉద్యోగులు, కార్మికులకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.
అంతకుముందే ఇవి పూర్తి చేయాలి..
అలాగే కాచిగూడ, ఫలక్‌నుమా వైపు నుంచి తూర్పు శివారు ప్రాంతాలకు చేరుకోవడం మరింత సులభం కానుంది. అయితే ఎంఎంటీఎస్ సేవలు ప్రారంభించడానికి ముందు కొన్ని కీలక పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఎంఎంటీఎస్ రైళ్ల ఎత్తుకు అనుగుణంగా ప్లాట్‌ఫామ్‌లను పెంచడం, ప్రయాణికుల భద్రతకు అనువైన సదుపాయాలు కల్పించడం అవసరం. అంతేకాదు ఇప్పటికే ఈ మార్గంలో ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైళ్ల రద్దీ ఎక్కువగా ఉండటంతో అదనపు ఎంఎంటీఎస్ సర్వీసులకు సమయ కేటాయింపు, లైన్ సామర్థ్యంపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు.
రైళ్ల వేగాన్ని దృష్టిలో ఉంచుకుని ఆధునిక ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈ పనులు పూర్తయిన తర్వాతే కొత్త కారిడార్‌లో ఎంఎంటీఎస్ సేవలను ప్రారంభించే అవకాశముందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ సబర్బన్ రైలు నెట్‌వర్క్ మరింత విస్తరించి, వేలాది మంది రోజువారీ ప్రయాణికులకు ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది.