Headlines

100 డాలర్లు దాటిన ముడి చమురు ధరలు.. భారత్ ఆర్థిక వ్యవస్థపై పశ్చిమాసియా సంక్షోభం..! | Middle East Tensions Drive Crude Oil Prices Above $100: Impact on India’s Economy


పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ముడి చమురు ధరలు 100 డాలర్లను దాటింది. దీంతో స్టాక్‌ మార్కెట్లతో పాటు దేశ ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. అమెరికా-ఇరాన్‌ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మళ్లీ చుక్కలను తాకుతున్నాయి. సౌదీ అరేబియా ఇంధన ఉత్పాదక కేంద్రాలపై హౌతీ మిలిటెంట్లు డ్రోన్లు, క్షిపణులతో దాడి చేయడంతో పశ్చిమాసియాలో
టెన్షన్‌ వాతావరణం మరింత పెరిగింది. బ్యారెల్‌ బ్రెంట్‌ ముడి చమురు రేటు మరోసారి 100 డాలర్లను సమీపించింది. దీంతో మిడిల్‌ ఈస్ట్‌లో అశాంతి పెరిగితే క్రూడాయిల్‌ ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి.

దేశ ఇంధన అవసరాలు దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. ఇందులో రష్యాతోపాటు మిడిల్‌ ఈస్ట్‌ దేశాల వాటానే ఎక్కువ. అయితే యుద్ధంతో యూఏఈ, సౌదీ, ఖతార్‌, బహ్రెయిన్‌, కువైట్‌ తదితర గల్ఫ్‌ దేశాల నుంచి భారత్‌కు ముడి చమురు, గ్యాస్‌ రాక ఇబ్బందికరంగా మారింది. పెట్రో ఉత్పత్తుల రవాణాకు కీలకమైన హొర్ముజ్‌ జలసంధిలో నౌకల ప్రయాణం ప్రమాదకరంగా మారింది. నౌకలపై దాడులు జరిగితే బ్యారెల్‌ విలువ 120 డాలర్లను తాకే అవకాశం ఉంది. అమెరికాకు మద్దతిస్తున్నాయని గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ దాడులకు దిగుతోంది.

మిడిల్‌ ఈస్ట్‌ ఉద్రిక్తతలు దేశీయ మార్కెట్‌లో పెట్రో ధరల పెంపునకు దారితీస్తున్నాయి. పశ్చిమాసియా సంక్షోభం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ ఒత్తిడికి లోనవుతోంది. చమురు దిగుమతుల చెల్లింపుల భారం, ఇంధన ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం విజృంభణ, రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీరేట్ల పెంపు, స్టాక్‌ మార్కెట్లలో ఒడిదుడుకులు, రూపాయి మారకం విలువ క్షీణత, చమురు ఆధారిత ఉత్పత్తుల తయారీ ఖరీదెక్కడం, ఎగుమతుల పతనం వంటివి దేశ ఎకానమీని రిస్క్‌లో పడేస్తున్నాయి.

ఈ ఏడాది ఫిబ్రవరి 28న యుద్దం ప్రారంభం కాగా, అప్పట్నుంచి ఇప్పటిదాకా దేశంలో లీటర్‌ పెట్రోల్‌ రేటు రూ.7.35, డీజిల్‌ ధర రూ.7.53 పెరిగింది. అమెరికాతో ఇరాన్‌ చర్చల కారణంగా అప్పట్లో కొంతమేర శాంతియుత పరిస్థితులు మిడిల్‌ ఈస్ట్‌లో నెలకొన్నాయి. ఇది మార్కెట్‌లో క్రూడ్‌ ధరల తగ్గుముఖానికి కలిసొచ్చింది. అయితే మళ్లీ దాడులు మొదలవడంతో పరిస్థితి మొదటికొచ్చింది. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌-జూలైలో భారత ముడి చమురు దిగుమతుల విలువ 56 శాతం పెరిగి 63.4 బిలియన్‌ డాలర్లకు చేరింది. నిరుడు ఇదే సమయంలో 40.5 బిలియన్‌ డాలర్లేనని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *