Headlines

Hyderabad: డెలివరీ బాయ్స్‌కు తెలంగాణ ప్రభుత్వం సూపర్ న్యూస్.. ఈ సెంటర్లలో ఛార్జింగ్, వైఫై సౌకర్యం.. హాయిగా విశ్రాంతి కూడా.. | Telangana Govt Good News for Delivery Boys: Pragathi Centres to Offer Rest, WiFi, Charging and Medical Facilities


డెలివరీ బాయ్స్‌కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ప్రాజెక్ట్ ప్రగతి పేరుతో జెప్టోతో కీలక ఒప్పందం చోటుచేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా డెలివరీ బాయ్స్ కోసం హైదరాబాద్‌లో ప్రగతి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం, జెప్టో సంస్థ కలిసి ఈ సెంటర్లను గిగ్ వర్కర్ల కోసం త్వరలో ఏర్పాటు చేయనున్నారు. తొలుత నగరంలో 5 కేంద్రాలను నెలకొల్పనుండగా.. దశలవారీగా మరిన్ని కేంద్రాలు ప్రారంభించనున్నారు. ఈ సెంటర్లలో డెలివరీ బాయ్స్‌కు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. వాటర్, వాష్ రూమ్స్, మొబైల్ ఛార్జింగ్, వైఫై, ఫస్ట్ ఎయిడ్ వంటి సౌకర్యాలు ప్రవేశపెట్టనున్నారు. అలాగే ఈ కేంద్రాల్లో ఎప్పటికప్పుడు ఉచిత మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు కార్మికులకు ఈ-శ్రమ్ రిజిస్ట్రేషన్‌పై అవగాహన కల్పించనున్నారు.

ఈ ప్రగతి కేంద్రాల బాధ్యతలను ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ జెప్టోకు తెలంగాణ ప్రభుత్వం అప్పగించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం, జెప్టో మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఏ సంస్థకు చెందిన గిగ్ వర్కర్లు అయినా వీటిని ఉపయోగించుకోవచ్చు. విశ్రాంతి తీసుకోవడంతో పాటు తమ ప్రాథమిక అవసరాలను తీర్చుకోవచ్చు. ఈ కేంద్రాల్లో అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. నగరంలో అనేక గిగ్ ఫ్లాట్‌ఫామ్స్ ఫుడ్, క్యాబ్, గ్రాసరీ, దుస్తుల డెలివరీ వంటి సేవలు అందిస్తున్నాయి. ఈ ఫ్లాట్‌ఫామ్స్‌లో వేలమంది డెలివరీ బాయ్స్ పనిచేస్తున్నారు. ఎండ, వాన, చలిని పక్కనపెట్టి ట్రాఫిక్‌ రద్దీలో పనిచేస్తున్నారు. ఎక్కువసేపు రోడ్లపై తిరగాల్సి ఉంటుంది. కానీ వీళ్లు విశ్రాంతి తీసుకునేందుకు, త్రాగునీరు, టాయిలెట్ల వంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా ఎక్కడా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. వీరి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం, జెప్టో ముందుకొచ్చాయి. పనివేళల్లో కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు ఈ ప్రగతి కేంద్రాలు ఉపయోగపడనున్నాయి.

కొన్నిసార్లు పని మధ్యలో ఛార్జింగ్ అయిపోవడం వల్ల డెలివరీ బాయ్స్ ఇబ్బంది పడుతున్నాయి. అయితే కేంద్రాల్లో కాసేపు ఛార్జింగ్ పెట్టుకుని ఆ తర్వాత మళ్లీ పని చేసుకోవచ్చు. డెలివరీ బాయ్స్ ఎక్కువసేపు ట్రాఫిక్‌లో రోడ్లపై తిరగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. దీంతో ఎప్పటికప్పుడు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి ఆరోగ్యంపై అవగాహన కల్పించనున్నారు. గిగ్ కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, సామాజిక భద్రతా కార్యక్రమాలపై కూడా అవగాహన కల్పించనున్నారు. అయితే ఈ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన నిధులతో పాటు నిర్వహణను జెప్టో సంస్థ చూసుకోనుంది. త్వరలో ఏయే ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *