జగదీష్‌రెడ్డి హత్య కేసులో సాదిక్ కస్టడీ విచారణ కీలక దశకు చేరింది. కెమికల్స్ కొనుగోలు నుంచి.. సౌజన్యతో సంబంధాల వరకు.. పోలీసులు ఒక్కో అంశాన్ని ఆరా తీశారు. మరి ఈ ప్రశ్నలకు సాధిక్ ఇచ్చిన సమాధానాలేంటి? ఏ ప్రశ్న దగ్గర మౌనం వహించాడు? పోలీసుల విచారణలో అసలు బయటపడేదేంటి? అనే వివరాలను తెలుసుకుందాం.. ఏఈ నూకరాజు అల్లుడు జగదీష్‌రెడ్డి హత్య కేసు.. రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. మూడు రోజుల కస్టడీలో ఉన్న సాదిక్‌ను సర్పవరం పోలీసులు రెండో రోజూ ప్రశ్నించారు. జగదీష్ హత్యకు ముందు ఏం జరిగింది? అతడితో చివరిసారిగా ఎప్పుడు మాట్లాడావు..? జగదీష్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో హైదరాబాద్ ఎందుకు వెళ్లావు? అంటూ వరుస ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. అయితే.. పోలీసుల ప్రశ్నలకు నిందితుడు సాదిక్ నుంచి ఆశించిన సమాధానాలు రాలేదని సమాచారం. కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా.. పోలీసులనే ఎదురు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
కెమికల్స్ కొన్నది నిజమేనని అంగీకరించిన సాదిక్
ఇక.. కెమికల్స్ కొనుగోలు వ్యవహారంపైనా పోలీసులు సాదిక్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కెమికల్స్ కొన్నది నిజమేనని అంగీకరించిన సాదిక్.. దాన్ని ఎక్కడా వినియోగించలేదని చెప్పినట్లు సమాచారం. ఇక ఏఈ నూకరాజు కుటుంబాన్ని చివరిసారిగా కలిసినప్పుడు ఏం మాట్లాడుకున్నారన్న ప్రశ్నకు.. సాధారణంగానే మాట్లాడుకున్నామని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. జగదీష్ హత్యతో తనకు సంబంధం లేదని చెబుతున్న సాదిక్.. విచారణలో సౌజన్య అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు సమాచారం. సౌజన్య పాత్ర లేకుండా ఈ వ్యవహారం నడిచేదా? అంటూ పోలీసులనే ఎదురు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. సౌజన్య, ఆమె తండ్రి తన ఇంటికి ఎన్నిసార్లు వచ్చారు? ఎందుకు వచ్చారు? అనే కోణంలోనూ దర్యాప్తు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. అయితే.. ఆస్తులను తన పేరుపైకి మార్చాలని సౌజన్య కుటుంబాన్ని బెదిరించావా? అన్న ప్రశ్నకు మాత్రం సాధిక్ మౌనం వహించినట్లు తెలుస్తోంది.
సాధిక్తో రెగ్యులర్‌గా కాంటాక్ట్‌లో ఉన్న నలుగురి విచారణ
మరోవైపు.. సాదిక్‌కు సన్నిహితంగా ఉన్న నలుగురిని కూడా పోలీసులు విచారణకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. వీరితో సాదిక్ రెగ్యులర్‌గా కాంటాక్ట్‌లో ఉండేవాడని భావిస్తున్న పోలీసులు.. వారి నుంచి కూడా కీలక సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అటు సాధిక్ నుంచి సమాధానాలు రాబడుతూనే.. ఇటు అతడు చెబుతున్న విషయాలను తమ దగ్గరున్న సీసీ కెమెరా ఫుటేజ్, కాల్ డేటా, ఇతర ఆధారాలతో పోల్చి చూస్తున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ అత్తరు వ్యాపారుల దగ్గరకు..
విచారణలో భాగంగా సాదిక్‌కు విషపూరితమైన ద్రావణాలను విక్రయించిన హైదరాబాద్‌కు చెందిన అత్తరు వ్యాపారులు రెహమాన్, అబ్దుల్ ఖాదీర్ ను కూడా పోలీసులు విచారించారు. సాదిక్ ఖాన్ తమ వద్దకు వచ్చి.. తాను షుటర్ ని అని.. అత్యంత విషపూరితమైన లిక్విడ్ కావాలని కోరాడని తెలిపారు. మొదట అతడికి థాయ్ పొటాషియం ఇచ్చినట్లు వెల్లడించారు.
మూడు రోజుల కస్టడీలో ఇప్పటికే రెండు రోజులు పూర్తయ్యాయి. దాదాపు వంద ప్రశ్నలు సంధించినా.. చాలా ప్రశ్నలకు సాధిక్ సమాధానాలు దాటవేసినట్లు తెలిసింది. తనకు ఎలాంటి ప్రమేయం లేదని సాధిక్ చెబుతుంటే.. పోలీసులు మాత్రం ఒక్కో ఆధారాన్ని అతడి ముందు పెడుతున్నట్లు తెలుస్తోంది. మరి సాధిక్ చెబుతున్న మాటలకు.. పోలీసుల దగ్గరున్న ఆధారాలకు పొంతన ఉందా? మిగిలిన ఒక్కరోజు కస్టడీలో ఈ కేసులో ఏమైనా కీలక విషయం బయటపడుతుందా? అనేది ఆసక్తిగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..