Headlines

Bank Holidays: వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులు బంద్.. దేశవ్యాప్తంగా క్లోజ్.. ముందే జాగ్రత్త పడండి.. | Bank Customers Alert: Banks to Remain Closed for Four Consecutive Days from September 11


బ్యాంకింగ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. బ్యాంకులు వరుసగా నాలుగు రోజుల పాటు మూతపడనున్నాయి. బ్యాంకు ఉద్యోగుల తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్ 11న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని, పింఛను సమస్యలను తక్షణమే పరిష్కరించడం, పనితీరు ఆధారంగా ప్రోత్సాహక పథకాన్ని అమలు చేయడం వంటి డిమాండ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేందుకు బ్యాంక్ యూనియన్లు శుక్రవారం రోజున దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టనున్నట్లు ప్రకటించాయి. దీంతో సెప్టెంబర్ 11న బ్యాంకు సేవల్లో అంతరాయం ఏర్పడనుంది. ఉద్యోగులు సమ్మెకు దిగుతుండటంతో దేశవ్యాప్తంగా కస్టమర్లు బ్యాంక్ సేవలు పొందటంలో ఇబ్బందులు ఎదుర్కొనున్నారు. ఆ తర్వాత రెండో శనివారం, ఆదివారం, వినాయక చవితి రావడంతో వరుసగా నాలుగు రోజులు మూతపడనున్నాయి.

వరుసగా నాలుగు రోజులు బంద్

సెప్టెంబర్ 11న సమ్మె ప్రభావంతో బ్యాంకు సేవలు ప్రభావితం కానుండగా.. ఆ తర్వాత సెప్టెంబర్ 12న రెండో శనివారం బ్యాంకులకు సాధారణ సెలవు కావడంతో ఆ రోజు మూతపడనున్నాయి. ఇక సెప్టెంబర్ 13న ఆదివారం బ్యాంకులు ఉండవు. ఆ తర్వాతి రోజు సెప్టెంబర్ 14న వినాయక చవితి పండుగ సెలవుల కారణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు దేశవ్యాప్తంగా నిలిచిపోనున్నాయి. దీంతో సెప్టెంబర్ 11 నుంచి 14 వరకు వరుసగా నాలుగు రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయని చెప్పవచ్చు. దీంతో వల్ల బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్, చెక్కుల క్లియరెన్స్‌తో పాటు ఇతర సేవలు నిలిచిపోనున్నాయి. సాధారణ ప్రజలతో పాటు వ్యాపార, వాణిజ్య వర్గాలపై ఇది ప్రభావం చూపనుంది. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే సెప్టెంబర్ 28 నుంచి మరో మూడు రోజుల పాటు, ఆపై అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని బ్యాంక్ ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి.

చర్చలు విఫలం

అయితే కేంద్ర ప్రభుత్వంతో బ్యాంకింగ్ యూనియన్లు చర్చలు జరిపారు. అయతే ఈ చర్చలు విఫలం కావడంతో శుక్రవారం సమ్మెకు దిగాలని నిర్ణయించాయి. ఐదు రోజుల పని దినాలు అమలు చేయడంపై సానుకూల నిర్ణయం తీసుకునేవరకు సమ్మెకు వాయిదా వేసేది లేదని బ్యాంక్ యూనియన్లు ప్రకటించాయి. ప్రధాన కార్మిక కమిషనర్ కేంద్ర కార్యాలయంలో ఈ చర్చలు జరిగాయి. ఆర్ధిక సేవల విభాగం, కార్మిక అధికారుల ప్రతినిధులతో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) చర్చలు జరిపింది. సమ్మెను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. కానీ బ్యాంక్ సంఘాలు ససేమిరా అని స్పష్టం చేశాయి. ముందుగా తాము పిలుపునిచ్చిన సమ్మె యథావిధిగా కొనసాగుతుందని తెలిపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *