Headlines

Andhra News: ఎలా కనిపెట్టారో.. ముందు పైలట్ వాహనంతో ఎంట్రీ ఇచ్చిన కారు.. ఆపి చెక్‌చేయగా | Anakapalli Police Seize 600 kg Ganja Worth Rs 3 Cr; 3 Arrested in Major Drug Bust


అనకాపల్లిని డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు పోలీసులు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఒడిశా నుంచి తుని వైపు అక్రమంగా తరలిస్తున్న రూ.3 కోట్ల విలువైన 600 కిలోల గంజాయిని అనకాపల్లి రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, రవాణాకు ఉపయోగించిన ఒక వ్యాన్, పైలట్‌గా వ్యవహరించిన హోండా సివిక్ కారును పోలీసులు సీజ్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా ధర్మాజీగూడెంకు చెందిన షేక్ మస్తాన్ వలి గంజాయి కేసులో విశాఖ సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు అతనికి నర్సీపట్నానికి చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అయితే విడుదలయ్యాక ఇద్దరూ కలిసి భారీగా గంజాయి రవాణాకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే ఒడిశాలోని దగుడుపల్లికి చెందిన ఓ వ్యక్తి నుంచి 600 కిలోల గంజాయిని సేకరించి, తుని సమీపంలో డెలివరీ చేస్తే సరుకు విలువతో పాటు అదనంగా రూ.3 లక్షల కమీషన్ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఒప్పందం ప్రకారం ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి నడక మార్గంలో, మోటార్‌సైకిళ్లపై దఫదఫాలుగా గంజాయిని సరిహద్దు దాటించారు. తర్వాత ఆ మొత్తాన్ని వ్యాన్‌లో లోడ్ చేసి పోలీసు నిఘా నుంచి తప్పించుకునేందుకు ఓ హోండా సివిక్ కారును వ్యాన్‌కు ముందు పైలట్ వాహనంగా నడిపారు. అయితే గంజాయి తరలిస్తున్నారనే ఖచ్చితమైన సమాచారం మేరకు అనకాపల్లి పోలీసులు సంపతిపురం జంక్షన్ వద్ద చెక్‌ పోస్ట్ ఏర్పాటు చేసి పైలట్ కారుతో పాటు వస్తున్న వ్యాన్‌ను అడ్డుకొని తనిఖీ చేశారు. కార్లులో అక్రమంగా తరలిస్తున్న 600 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

గంజాయి తరలిస్తున్న షేక్ మస్తాన్ వలి (A-1), షేక్ మదీనా (A-4), అల్లూరి జిల్లాకు చెందిన పాంగి రత్నాలు (A-6) లను అదుపులోకి తీసుకున్నారు. ఒడిశాకు చెందిన A-2, నర్సీపట్నానికి చెందిన A-3, అల్లూరి జిల్లాకు చెందిన A-5 పరారీలో ఉండటంతో వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. నిందితులకు పాత నేర చరిత్ర ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. A-1పై గతంలో రెండు కేసులు ఉండగా, A-3పై వివిధ పోలీస్ స్టేషన్లలో ఐదు కేసులు నమోదయ్యాయి. A-3పై కఠినమైన PIT-NDPS చట్టం కింద నిర్బంధ చర్యల (PD Act) అమలుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని వెల్లడించారు. A-6 పై కూడా గతంలో ఒక కేసు నమోదై ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *