Headlines

Andhra Pradesh: ప్రాణదాతలకు అండగా ఏపీ సర్కార్.. అవయవదాన బిల్లుకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం.. | AP Assembly Passes Human Organ Transplantation Amendment Bill 2026, Key Highlights


ఒక కుటుంబానికి తీరని విషాదం ఎదురైనా, మరో ఎనిమిది మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపే దివ్యౌషధం అవయవదానం. బ్రెయిన్‌డెడ్ అయిన తమ వారిని కోల్పోయిన దుఃఖంలోనూ సమాజం కోసం ముందుకొచ్చే దాతల కుటుంబాలకు అన్నివిధాలా అండగా నిలిచేందుకు ఏపీ ప్రభుత్వం చారిత్రక అడుగు వేసింది. అవయవదాన ప్రక్రియను సులభతరం చేస్తూ, అక్రమ వ్యాపారాలకు కఠిన శిక్షలు విధిస్తూ రూపొందించిన ఆంధ్రప్రదేశ్ మానవ అవయవాల మార్పిడి సవరణ బిల్లు -2026కు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్ సభలో ప్రవేశపెట్టారు.

దాత కుటుంబాలకు రూ.లక్ష సాయం.. ఉద్యోగ భరోసా

అవయవదానానికి ముందుకు వచ్చే కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను భారీగా పెంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం అందిస్తున్న రూ.10 వేల తక్షణ ఆర్థిక సాయాన్ని రూ.లక్షకు పెంచే ప్రతిపాదనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలనకు పంపినట్లు మంత్రి తెలిపారు. దాత కుటుంబాల ఆర్థిక పరిస్థితులను బట్టి, అర్హులైన కుటుంబ సభ్యులకు ఔట్‌సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. దాత పార్థివ దేహానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

రాష్ట్రంలో 5,920 మంది నిరీక్షణ

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం వేలాది మంది ప్రాణాపాయ స్థితిలో అవయవాల కోసం ఎదురుచూస్తున్నారు.

  • కిడ్నీలు: సుమారు 3,000 మంది
  • కాలేయం: దాదాపు 2,000 మంది
  • గుండె: దాదాపు 100 మంది
  • పాంక్రియాస్: నలుగురు

నెల రోజుల పసికందుల నుంచి 90 ఏళ్ల వృద్ధుల వరకు జాబితాలో ఉండగా పదేళ్లలోపు చిన్నారులే 40 మందికి పైగా ఉన్నారు. సరైన అవగాహన లేకపోవడం వల్లే డిమాండ్‌కు తగిన సంఖ్యలో దాతలు ముందుకు రావడం లేదని ప్రభుత్వం గుర్తించింది.

కొత్త చట్టంలోని కీలక సంస్కరణలు

భార్య, భర్త, తల్లిదండ్రులు, పిల్లలు, తోబుట్టువులతో పాటు ఇకపై తాత, అవ్వ, మేనమామ, మేనత్తలను కూడా దగ్గరి బంధువుల పరిధిలోకి చేర్చారు. రెండు వేర్వేరు కుటుంబాల్లోని దాతలు, గ్రహీతలకు అవయవాలు సరిపోలకపోతే.. ఆ రెండు కుటుంబాలు పరస్పరం అవయవాలను మార్పిడి చేసుకునే చట్టబద్ధమైన వెసులుబాటు కల్పించారు. సరైన వైద్య పరిస్థితులు ఉంటే గుండె ఆగిపోయిన తర్వాత కూడా అవయవాలను సేకరించవచ్చు. దాత, గ్రహీతల వివరాల నమోదు, ప్రక్రియ పర్యవేక్షణకు గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో ప్రత్యేక అధికారుల నియామకం చేపట్టనున్నారు.

అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

అవయవాల దానంలో ఎలాంటి దోపిడీ, అక్రమాలు జరగకుండా నిబంధనలను కఠినతరం చేశారు.

అక్రమంగా అవయవం తొలగింపు: గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.20 లక్షల వరకు జరిమానా.

అక్రమ వ్యాపారం, మధ్యవర్తిత్వం: 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకు భారీ జరిమానా.

మైనర్ల నుంచి అవయవ సేకరణపై కఠిన ఆంక్షలు విధించడంతో పాటు విదేశీయులకు అవయవదానంపై ప్రత్యేక అనుమతులను తప్పనిసరి చేశారు.

9కి చేరిన ట్రాన్స్‌ప్లాంట్ కేంద్రాలు.. ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతం

రాష్ట్రంలో అవయవ మార్పిడి కేంద్రాల సంఖ్యను 3 నుంచి 9కి పెంచినట్లు మంత్రి ప్రకటించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని 12 టీచింగ్ హాస్పిటల్స్‌ను ట్రాన్స్‌ప్లాంటేషన్ కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నారు. తిరుపతిలోని పద్మావతి హృదయాలయలో గత ఏడాదిలోనే 18 గుండె మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా జరిగాయని గుర్తుచేశారు.

అపోహలు వీడాలి.. ప్రాణాలు నిలపాలి

ప్రజల్లో అపోహలను తొలగించేందుకు బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వంటి ప్రముఖులతో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. మరణం తర్వాత కూడా మరో ఎనిమిది మందిలో జీవించేందుకు దోహదపడే ఈ మహాదానంపై విస్తృత చైతన్యం తీసుకురావడమే ప్రభుత్వ సంకల్పం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *