Headlines

Andhra Pradesh: 12లక్షలు ఇస్తే మీ కూతురిని పంపిస్తా.. తాళికట్టిన రోజే భార్యను బేరం పెట్టిన నీచుడు.. అసలు ఏం జరిగిందంటే..? | Groom demands Rs 12 lakh from in laws just hours after the wedding in Eluru

Andhra Pradesh: 12లక్షలు ఇస్తే మీ కూతురిని పంపిస్తా.. తాళికట్టిన రోజే భార్యను బేరం పెట్టిన నీచుడు.. అసలు ఏం జరిగిందంటే..? | Groom demands Rs 12 lakh from in laws just hours after the wedding in Eluru


ప్రేమించానని నమ్మించాడు.. జీవితాంతం తోడుంటానని తాళి కట్టాడు.. తీరా పెళ్లయ్యాక అసలు స్వరూపం బయటపెట్టాడు. కట్టుకున్న భార్యను కన్నవారికి అప్పగించేందుకు రూ.12 లక్షలు ఇవ్వాలంటూ కిడ్నాపర్ తరహాలో బేరసారాలకు దిగిన దారుణ ఘటన ఏలూరు జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ప్రేమను వ్యాపారంగా మార్చి, కన్నవారి వేదనను పెట్టుబడిగా మార్చుకోవాలని చూసిన ఈ కేటుగాళ్ల వ్యవహారం స్థానికంగా కలకలం రేపుతుంది. నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన రాజేశ్వరి అనే యువతి నాలుగు రోజుల క్రితం కళాశాలకు వెళ్లి ఎంతకూ తిరిగి రాలేదు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఆమె కోసం గాలింపు చేపట్టారు. అయితే కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లికి చెందిన మధు అనే యువకుడు తన నలుగురు స్నేహితులతో కలిసి రాజేశ్వరిని తీసుకెళ్లినట్లు తేలింది. అనంతరం వీరవల్లి పోలీస్ స్టేషన్‌లో వారు ప్రేమ వివాహం చేసుకున్నారు. దీంతో కన్నవారు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.

పెళ్లయిన రోజే రూ. 12 లక్షల డిమాండ్

ప్రేమించి పెళ్లి చేసుకున్న సంతోషం కూడా లేకుండా, మధు, అతని స్నేహితులు పెళ్లయిన రోజే తమ నయా దందాను ప్రారంభించారు. రాజేశ్వరి తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. ‘‘రూ.12 లక్షలు ఇస్తేనే మీ అమ్మాయిని మీ ఇంటి ముందు దింపుతాం.. లేకపోతే అంతే సంగతులు. అలాగే మాపై ఎలాంటి కేసు పెట్టకూడదు’’ అంటూ బెదిరింపులకు దిగారు. కన్నకూతురు ప్రాణాల కోసం అల్లాడిపోయిన తల్లిదండ్రులు రూ.6 లక్షలు ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. కానీ డబ్బు ఇచ్చినా తమ బిడ్డను క్షేమంగా అప్పగిస్తారన్న నమ్మకం లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

రంగంలోకి పోలీసులు.. మంత్రి కీలక ఆదేశాలు

కూతురి రక్షణ కోసం బాధితులు నూజివీడులో మంత్రి కొలుసు పార్థసారధిని ఆశ్రయించి తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు. బాధితుల ఫిర్యాదుపై తీవ్రంగా స్పందించిన మంత్రి వెంటనే పోలీసులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన నూజివీడు పోలీసులు కిడ్నాప్ తరహా బెదిరింపులకు దిగిన నిందితుడు మధు, అతని స్నేహితుల కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *