Headlines

Moral Story: అహంకారం, గర్వం.. తెలివి ముందు పోతుంది.. కుందేలు – సింహం కథ | The Clever Rabbit and the Proud Lion: A Classic Moral Story

Moral Story: అహంకారం, గర్వం.. తెలివి ముందు పోతుంది.. కుందేలు – సింహం కథ | The Clever Rabbit and the Proud Lion: A Classic Moral Story


ఒక విశాలమైన అడవిలో ఏనుగులు, కోతులు, ఒంటెలు, తాబేళ్లు, కుందేళ్లు, పులులు, నక్కలు ఇలా ఎన్నో జంతువులు కలిసి శాంతియుతంగా జీవించేవి. ఆ అడవికి ఓ బలమైన సింహం రాజుగా ఉండేది. కొంతకాలానికి సింహానికి వయసు పైబడింది. వృద్ధాప్యం కారణంగా అది మునుపటిలా వేటాడలేకపోయేది. ఆహారం దొరకక సింహం చాలా ఇబ్బంది పడింది. ఒకరోజు సింహం అడవిలోని జంతువులన్నింటినీ సమావేశానికి పిలిచింది. ‘నాకు ఇప్పుడు వయసైంది. నేను మిమ్మల్ని ప్రతిరోజూ వేటాడలేను. అందుకే మీ అందరికీ ఒక్కో రోజు కేటాయిస్తున్నాను. ఆ రోజు ఎవరి వంతు ఉంటుందో వారు స్వయంగా నా గుహకు వచ్చి నాకు ఆహారంగా మారాలి. ఎవరూ నన్ను మోసం చేయకండి. నాకు ఇంకా పోరాడే శక్తి ఉంది!’ అని సింహం గంభీరంగా గర్జించింది. సింహం గర్జనకు భయపడిన జంతువులన్నీ తలలు ఊపుతూ అంగీకరించాయి.

మరుసటి రోజు నుంచి ఒక్కో జంతువు తన వంతు ప్రకారం సింహం గుహకు వెళ్లేది. సింహం వాటిని తిని ఆకలి తీర్చుకునేది. కొంతకాలం ఇలా సాగింది. ఒకరోజు కుందేలు తల్లి వంతు వచ్చింది. ఆ రోజు తనకు మరణం తప్పదని భావించిన ఆమె చాలా బాధపడింది. ‘నాన్నా! ఇవాళ నా వంతు వచ్చింది. నేను సింహం దగ్గరకు వెళ్లాలి. ఇక నేను తిరిగి రాకపోవచ్చు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. తల్లి మాటలు విన్న చిన్న కుందేలు మాత్రం భయపడలేదు. ‘అమ్మా, నువ్వు బాధపడకు. నీ బదులు నేను సింహం దగ్గరకు వెళ్తాను. నేను చిన్న కుందేలునే కావచ్చు. కానీ నా తెలివితో ఆ సింహానికి ఒక గుణపాఠం చెబుతాను’ అని ధైర్యంగా చెప్పింది. తల్లి కుందేలు ఎంతగా వారించినా, కుందేలు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.

కుందేలు నెమ్మదిగా సింహం గుహ వైపు బయలుదేరింది. మార్గమధ్యంలో మొదట ఓ కోతిని కలిసింది. కోతీ! నువ్వు సింహాన్ని చూసి ఎందుకు అంత భయపడుతున్నావు? నేను చిన్న కుందేలుని అయినా భయపడటం లేదు. ఇదంతా ఒక నాటకం మాత్రమే. ఆ సింహానికి ఎలా బుద్ధి చెబుతానో నువ్వే చూస్తావు. మధ్యాహ్నం సరస్సు దగ్గరకు రా’ అని చెప్పింది. తర్వాత ఓ ఏనుగును కలిసింది. ‘ఏనుగూ! నువ్వు ఇంత బలవంతుడివి. అయినా సింహాన్ని చూసి భయపడుతున్నావు. నేను మాత్రం చిన్న కుందేలుని. నా ప్రణాళికను చూడాలంటే మధ్యాహ్నం సరస్సు దగ్గరకు రా. అని చెప్పింది.

ఇవి కూడా చదవండి



అదే విధంగా పులిని, నక్కను కూడా కలిసి తన ప్రణాళిక గురించి చెప్పింది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. నేను సింహానికి బుద్ధి చెబుతాను. మీరు కేవలం సాక్షులుగా ఉండండి’ అని కుందేలు చెప్పింది. జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. ఇంత చిన్న కుందేలు సింహాన్ని ఎలా ఎదుర్కొంటుందో చూడాలని ఆసక్తిగా ఎదురుచూశాయి. కుందేలు కావాలనే చాలా ఆలస్యంగా సింహం గుహకు చేరుకుంది. అప్పటికే ఆకలితో ఉన్న సింహం కోపంతో ఊగిపోతోంది. ‘ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావు?’ అని సింహం గర్జించింది. కుందేలు భయపడుతున్నట్లు నటిస్తూ ‘మహారాజా! నన్ను క్షమించండి. నేను ఒంటరిగా రాలేదు. మొదట మా అమ్మను పంపించాలని అనుకున్నాం. కానీ నేను ఆమె బదులుగా వచ్చాను. దారిలో మాకు పెద్ద సమస్య ఎదురైంది’ అని చెప్పింది. ‘ఏమిటా సమస్య?’ అని సింహం అడిగింది.

కుందేలు నెమ్మదిగా చెప్పింది. ‘మహారాజా! మన అడవిలోకి మరో సింహం వచ్చింది. అది తననే ఈ అడవికి రాజునని చెబుతోంది. నన్ను అడ్డగించి, ప్రతిరోజూ ఒక జంతువును తనకు ఆహారంగా పంపాలని ఆదేశించింది’. ఆ మాటలు విన్న సింహానికి కోపం తారస్థాయికి చేరింది. ‘ఏమిటి? ఈ అడవికి రాజు నేనే! నా రాజ్యంలోకి వచ్చి ఇంకొకడు రాజునని చెబుతున్నాడా? వెంటనే అతన్ని నాకు చూపించు. వాడి సంగతి నేను చూస్తాను!’ అని సింహం గర్జించింది. ‘అలాగే మహారాజా. అతను సరస్సు దగ్గర ఉన్నాడు. రండి, చూపిస్తాను’ అని కుందేలు చెప్పింది. దీంతో సింహం కుందేలుతో కలిసి సరస్సు దగ్గరకు వెళ్లింది. అక్కడ చెట్ల వెనుక కోతి, ఏనుగు, పులి, నక్క తదితర జంతువులు దాక్కొని ఈ దృశ్యాన్ని ఆసక్తిగా చూస్తున్నాయి. కుందేలు సింహాన్ని సరస్సు అంచుకు తీసుకెళ్లింది. ‘మహారాజా! ఆ కొత్త రాజు ఈ సరస్సులోనే ఉన్నాడు. చూడండి!’ అని చెప్పింది. సింహం నీటిలోకి చూసింది. నీటిలో తన ప్రతిబింబమే కనిపించింది. కానీ సింహానికి అది మరో సింహంలా కనిపించింది! ‘అక్కడ ఉన్నది ఎవరు?’ అని సింహం గర్జించింది. సరస్సులోని ప్రతిబింబం కూడా గర్జిస్తున్నట్లు కనిపించింది.

సింహం మరింత కోపంతో, ‘నా రాజ్యాన్ని ఆక్రమించడానికి వచ్చావా? బయటకు రా!’ అని గర్జించింది. నీటిలోని ప్రతిబింబం కూడా అదే విధంగా కనిపించింది.

ఇక సింహం తన కోపాన్ని అదుపు చేసుకోలేకపోయింది.’ఇప్పుడే నీ పని పడతాను!’ అంటూ సరస్సులోకి దూకింది. చప్పున నీటిలో పడిపోయింది! నీటిలోకి దూకిన సింహానికి అక్కడ మరే సింహమూ కనిపించలేదు. తన ప్రతిబింబాన్ని చూసి తానే మోసపోయానని అర్థమైంది. అప్పటికే కుందేలు దూరంగా వెళ్లిపోయింది. చెట్ల వెనుక దాక్కున్న జంతువులన్నీ బయటకు వచ్చాయి. అవి కుందేలు తెలివిని చూసి ఎంతో సంతోషించాయి. ‘చిన్నదానివైనా నీ తెలివి చాలా గొప్పది!’ అని ఏనుగు ప్రశంసించింది. ‘నీ ధైర్యం వల్ల మనందరికీ సింహం నుంచి విముక్తి లభించింది’ అని పులి చెప్పింది. సింహం మాత్రం సిగ్గుతో తలదించుకుంది. తన బలంతో కాకుండా, చిన్న కుందేలు తెలివితో ఓడిపోయానని గ్రహించింది. ఆ రోజు నుంచి సింహం తన ప్రవర్తనను మార్చుకుంది. అడవిలోని జంతువులను భయపెట్టడం మానేసింది. జంతువులన్నీ మళ్లీ ఆనందంగా, ప్రశాంతంగా జీవించసాగాయి.

నీతి

బలం కంటే తెలివి గొప్పది. సమస్య ఎంత పెద్దదైనా ధైర్యంగా ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది. ఎంత బలవంతుడైనా, అహంకారంతో ప్రవర్తిస్తే తెలివైనవారి ముందు ఓడిపోవాల్సిందే. కష్టాలు ఎదురైనప్పుడు భయపడకుండా ధైర్యం, సమయస్ఫూర్తి, తెలివితేటలతో ఆలోచిస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *