
పాక్‌పై భారత్ ఘన విజయం.. ప్రపంచకప్ తదుపరి రౌండ్‌కు అర్హత
హాకీ ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్ అదిరిపోయే విజయం సాధించింది. బుధవారం జరిగిన పూల్-D చివరి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు 5-3 తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ విజయంతో భారత్ టోర్నమెంట్‌లో తదుపరి రౌండ్‌కు అర్హత సాధించగా.. పాకిస్థాన్ ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. మ్యాచ్ ప్రారంభం నుంచే భారత్ దూకుడుగా ఆడింది. ఐదో నిమిషంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి భారత్‌కు శుభారంభం అందించాడు. ఆ తర్వాత 11వ నిమిషంలో అభిషేక్ అద్భుతమైన ఫీల్డ్ గోల్ చేయడంతో భారత్ ఆధిక్యం 2-0కు చేరింది.
రెండో క్వార్టర్‌లోనూ భారత దాడులు కొనసాగాయి. 21వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ మరో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మార్చి తన ఖాతాలో రెండో గోల్ నమోదు చేశాడు. అయితే వెంటనే పాకిస్థాన్ హన్నన్ షాహిద్ ద్వారా గోల్ సాధించి భారత్ ఆధిక్యాన్ని తగ్గించింది. 24వ నిమిషంలో అభిషేక్ మరోసారి గోల్ చేయడంతో భారత్ 4-1 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇదే సమయంలో పాకిస్థాన్ తరఫున సఫ్యాన్ ఖాన్ గోల్ చేయడంతో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి భారత్ 4-2తో ముందంజలో నిలిచింది.
మూడో క్వార్టర్‌లో భారత ఉపకెప్టెన్ హార్దిక్ సింగ్ పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మార్చాడు. దీంతో భారత్ ఆధిక్యం 5-2కు పెరిగింది. చివరి క్వార్టర్‌లో పాకిస్థాన్ పోరాటం కొనసాగించినప్పటికీ భారత రక్షణను పూర్తిగా ఛేదించలేకపోయింది. 46వ నిమిషంలో హన్నన్ షాహిద్ మరో గోల్ చేసినా.. చివరికి భారత్ 5-3తో విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్, అభిషేక్ చెరో రెండు గోల్స్‌తో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. హార్దిక్ సింగ్ కూడా ఒక గోల్ సాధించాడు. పాకిస్థాన్ తరఫున హన్నన్ షాహిద్ రెండు, సఫ్యాన్ ఖాన్ ఒక గోల్ చేశారు.ఇంగ్లండ్‌తో 2-4 ఓటమి తర్వాత తదుపరి రౌండ్ చేరాలంటే భారత్‌కు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. పాకిస్థాన్‌పై అద్భుత విజయంతో భారత్ పూల్-Dలో రెండో స్థానంలో నిలిచి తదుపరి దశకు దూసుకెళ్లింది.