Headlines

Home Loan: అసలు కంటే వడ్డీయే ఎక్కువ కడుతున్నారా.. హోమ్ లోన్ భారాన్ని ఇలా తగ్గించుకోండి.. | How to Reduce Home Loan Tenure and Interest: Easy Strategies to Save Lakhs

Home Loan: అసలు కంటే వడ్డీయే ఎక్కువ కడుతున్నారా.. హోమ్ లోన్ భారాన్ని ఇలా తగ్గించుకోండి.. | How to Reduce Home Loan Tenure and Interest: Easy Strategies to Save Lakhs


సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ అతిపెద్ద కల. అయితే ఇంటి అసలు ధర కంటే దానికి తీసుకునే లోన్‌పై చెల్లించే వడ్డీయే చాలా ఏళ్లపాటు అదనపు భారంగా మారుతుంటుంది. ఉదాహరణకు.. 20 నుంచి 30 ఏళ్ల సుదీర్ఘ కాల పరిమితితో తీసుకునే హోమ్ లోన్లలో, మీరు తీసుకున్న అసలు కంటే చెల్లించే వడ్డీ మొత్తమే కొన్నిసార్లు ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని క్రమశిక్షణతో కూడిన నిర్ణయాలతో హోమ్ లోన్ వడ్డీ భారాన్ని, వ్యవధిని గణనీయంగా తగ్గించుకోవచ్చని ఈజీ హోమ్ ఫైనాన్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ వినాయక్ వి. దేవుస్కర్ సూచిస్తున్నారు. లోన్ భారాన్ని సులభంగా తగ్గించుకోవడానికి ఆయన కొన్ని కీలక సూత్రాలు ప్రతిపాదించారు.

వ్యూహాత్మకంగా చెల్లింపులు

హోమ్ లోన్ ఈఎంఐలో అసలు, వడ్డీ అనే రెండు భాగాలుంటాయి. ప్రారంభ సంవత్సరాల్లో మీరు చెల్లించే ఈఎంఐలో అత్యధిక భాగం వడ్డీకే పోతుంది. లోన్ ఆరంభంలోనే అదనపు ముందస్తు చెల్లింపులు చేయడం వల్ల అసలు వేగంగా తగ్గుతుంది. ప్రతి ఏటా ఒక అదనపు EMI చెల్లిస్తే, 20 ఏళ్ల లోన్ వ్యవధిని దాదాపు 2 నుండి 3 ఏళ్ల వరకు తగ్గించుకోవచ్చు.

తక్కువ ఈఎంఐ ఆశతో సుదీర్ఘ వ్యవధి

తక్కువ EMI వస్తుందని 20 ఏళ్ల లోన్‌ను 30 ఏళ్లకు పెంచితే నెలవారీ భారం తగ్గవచ్చు గానీ, మొత్తం వడ్డీ భయంకరంగా పెరుగుతుంది.

  • ఉదాహరణకు: రూ.50 లక్షల లోన్‌ను 8శాతం వడ్డీకి తీసుకుంటే..
  • 20 ఏళ్ల వ్యవధికి: EMI దాదాపు రూ.41,800.
  • మొత్తం వడ్డీ : రూ.50.4 లక్షలు.
  • 30 ఏళ్ల వ్యవధికి: ఈఎంఐ దాదాపు రూ.36,700 కి తగ్గుతుంది.
  • కానీ మొత్తం వడ్డీ : రూ.82.1 లక్షలు
  • కేవలం 10 ఏళ్ల వ్యవధి పెంచడం వల్ల రూ.31 లక్షలకు పైగా అదనపు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.

 ప్రతి ఏటా EMI ని కాస్త పెంచండి

ఒకేసారి ఎక్కువ ఈఎంఐ చెల్లించలేకపోతే, మీ వార్షిక జీతం లేదా రాబడి పెరిగే కొద్దీ ఈఎంఐని ప్రతి ఏటా 5శాతం నుండి 10శాతం వరకు పెంచుతూ పోవాలి. దీనివల్ల బడ్జెట్‌పై పెద్దగా ఒత్తిడి పడకుండానే లోన్ వ్యవధి వేగంగా పూర్తవుతుంది. అయితే ఎమర్జెన్సీ ఫండ్స్, ఇతర ముఖ్యమైన ఆర్థిక లక్ష్యాలను పక్కనబెట్టి అతిగా ఈఎంఐ పెంచకూడదు.

ముందస్తు చెల్లింపు ఎక్కువ చేయండి

మీరు ఎంత తక్కువ రుణం తీసుకుంటే, అంత తక్కువ వడ్డీ చెల్లిస్తారు. డౌన్ పేమెంట్‌ను మరో 5-10శాతం పెంచడం వల్ల అసలు రుణం తగ్గుతుంది. అయితే లోన్ రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ, ఇంటీరియర్ ఖర్చులు, అత్యవసర నిధుల కోసం ఉంచే డబ్బును డౌన్ పేమెంట్ కోసం వాడకండి.

లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్..

మరొక బ్యాంకులో తక్కువ వడ్డీ ఉందనగానే వెంటనే లోన్ మార్చకూడదు. ప్రాసెసింగ్ ఫీజులు, లీగల్ ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాలి.
ఎప్పుడు మార్చాలి?: కొత్త బ్యాంకు వద్ద వడ్డీ రేటు కనీసం 0.5శాతం (50 బేసిస్ పాయింట్లు) తక్కువగా ఉండి, మీ లోన్ వ్యవధి ఇంకా 10 ఏళ్లకు పైగా మిగిలి ఉన్నప్పుడు మాత్రమే బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ప్రయోజనకరంగా ఉంటుంది.

కాగా మంచి క్రెడిట్ స్కోరు ఉంటే బ్యాంకర్లతో మాట్లాడి తక్కువ వడ్డీ రేట్లను పొందవచ్చు. సరైన ప్రణాళిక, క్రమశిక్షణ ఉంటే హోమ్ లోన్ అనేది భారం కాకుండా, మీ సొంతింటి కలను మరింత సంతోషంగా మారుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *