Headlines

Hyderabad: పాతబస్తీ నుంచి ఎయిర్‌పోర్ట్ దాకా.. హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల్లో కీలక అడుగు.. | Hyderabad Metro Phase 2: HMRL Speeds Up Consultant Selection for 4 Key Corridors


హైదరాబాద్‌ మెట్రో రెండో దశ పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు హెచ్‌ఎంఆర్‌ఎల్‌ చర్యలు ముమ్మరం చేసింది. ప్రతిపాదిత కారిడార్లకు జనరల్‌ కన్సల్టెంట్లను త్వరగా ఎంపిక చేసి ప్రాజెక్టు పనులకు వేగం పెంచాలని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల నిర్వహించిన ప్రీ-బిడ్‌ సమావేశానికి 12 సంస్థలు హాజరయ్యాయి. మెట్రో రెండో దశలో మొత్తం ఏడు కారిడార్లను ప్రతిపాదించారు. వీటి పరిధి సుమారు 122.9 కిలోమీటర్లు కాగా.. ప్రాజెక్టుకు రూ.38,595 కోట్ల వ్యయం అంచనా వేశారు. తొలిదశలో నాలుగు మార్గాలకు సంబంధించిన జనరల్‌ కన్సల్టెంట్ల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని హెచ్‌ఎంఆర్‌ఎల్‌ నిర్ణయించింది. ఇందులో నాగోల్‌ -శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, రాయదుర్గ్‌ – కోకాపేట, ఎంజీబీఎస్‌- చాంద్రాయణగుట్ట, ఎల్బీనగర్‌ – హయత్‌నగర్‌ కారిడార్లు ఉన్నాయి. వీటిలో నాగోల్‌ – శంషాబాద్‌ మార్గం 36.8 కిలోమీటర్లు, రాయదుర్గ్‌ – కోకాపేట 11.6 కిలోమీటర్లు, ఎంజీబీఎస్‌–చాంద్రాయణగుట్ట 7.5 కిలోమీటర్లు, ఎల్బీనగర్‌–హయత్‌నగర్‌ 7.1 కిలోమీటర్ల మేర ఉండనున్నాయి.

క్వాలిటీకి 70.. ఖర్చుకు ప్రాధాన్యం

జనరల్‌ కన్సల్టెంట్ల ఎంపికలో క్వాలిటీ కమ్‌ కాస్ట్‌ బేస్డ్‌ సెలెక్షన్‌ విధానాన్ని అనుసరించనున్నారు. మొత్తం 100 మార్కులతో సంస్థలను అంచనా వేయనున్నారు. గతంలో చేపట్టిన ప్రాజెక్టుల నాణ్యత, నిర్మాణంలో ఉపయోగించిన ముడి పదార్థాలు, పనుల పూర్తికి పట్టిన సమయం, వారంటీ తదితర అంశాలకు 70 మార్కులు కేటాయించారు. సంస్థల సీవీలు, నిపుణుల అర్హతలకు మరో 30 మార్కులు ఉంటాయి. సంస్థలు సమర్పించే పత్రాలను పరిశీలించడంతో పాటు.. గతంలో చేపట్టిన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించే అవకాశం ఉంది. నాణ్యత, సామర్థ్యం, టెండర్‌ ధర తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని తుది ఎంపిక చేయనున్నారు.

రెండో దశ డీపీఆర్‌పై కేంద్రం నిర్ణయం

మెట్రో రెండో దశకు సంబంధించిన డీపీఆర్‌కు కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. కేంద్రం నుంచి అనుమతులు వచ్చిన అనంతరం ప్రాజెక్టు పనులను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లను హెచ్‌ఎంఆర్‌ఎల్‌ చేస్తోంది. ఇదిలా ఉండగా ఎల్‌అండ్‌టీ నుంచి మొదటి దశ మెట్రో ప్రాజెక్టును స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన రుణాల సమీకరణపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకోసం ఎస్‌బీఐ క్యాప్స్‌ను కన్సల్టెన్సీగా నియమించింది. దేశ, విదేశాల్లోని బ్యాంకులతో సంప్రదింపులు జరిపి రుణాన్ని సమీకరించే బాధ్యతను ఎస్‌బీఐ క్యాప్స్‌కు అప్పగించింది. రుణాలపై వడ్డీ రేటు 3 నుంచి 4 శాతం లోపు ఉండేలా చూడాలని ప్రభుత్వం సూచించింది. ఈ రుణ సమీకరణ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అవసరమైన పూచీకత్తు, ఆస్తుల వివరాలను పరిగణనలోకి తీసుకుని బ్యాంకులతో చర్చలు జరుపుతున్నారు.

20 ఏళ్లలో రుణాల చెల్లింపు

సమీకరించే రుణాలను సుమారు 20 ఏళ్ల వ్యవధిలో తిరిగి చెల్లించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. నిర్ణీత సమయంలో కిస్తీలు చెల్లించకపోతే రాష్ట్రానికి వచ్చే రుణాల్లో నుంచి బ్యాంకులు తమ బకాయిలను సర్దుబాటు చేసుకునే అవకాశం ఉండేలా నిబంధనలు ఉండనున్నాయి. మొత్తంగా.. ఒకవైపు రెండో దశలో నాలుగు కీలక కారిడార్లకు కన్సల్టెంట్ల ఎంపికను వేగవంతం చేస్తూనే.. మరోవైపు మొదటి దశ టేకోవర్‌కు అవసరమైన రుణ సమీకరణపై ప్రభుత్వం సమాంతరంగా కసరత్తు చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *