Headlines

Indian Cricketers: గంగూలీ నుంచి రోహిత్ శర్మ దాకా.. స్మాల్ స్క్రీన్ హోస్ట్‌లుగా మెరిసిన టీమిండియా స్టార్ ప్లేయర్లు వీళ్లే | Indian cricketers who hosted reality tv shows rohit sharma sourav ganguly


Indian Cricketers: భారతదేశంలో కోట్లాది మందిని ఒకే తాటిపైకి తెచ్చేవి రెండే రెండు. ఒకటి క్రికెట్, మరొకటి ఎంటర్‌టైన్మెంట్. మైదానంలో సిక్సర్లు, ఫోర్లతో అలరించిన మన క్రికెట్ దిగ్గజాలు బుల్లితెరపై వ్యాఖ్యాతలుగా మారి రచ్చ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా రోహిత్ శర్మ కొత్త అవతారం ఎత్తుతుండటంతో ఈ టాపిక్ హాట్ టాపిక్‌గా మారింది.

1. రోహిత్ శర్మ – ఫ్యామిలీ ఫుల్ హౌస్

మైదానంలో తనదైన శైలిలో చమత్కారాలు విసురుతూ ఉండే టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, ఇప్పుడు బుల్లితెరపైకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఫ్యామిలీ ఫుల్ హౌస్ పేరుతో రాబోతున్న ఒక సరికొత్త ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్ షోతో ఆయన హోస్ట్‌గా మారబోతున్నారు. సోనీ ఎంటర్‌టైన్మెంట్ టెలివిజన్ లో ప్రసారం కానున్న ఈ షో టీజర్లు ఇప్పటికే సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. సెప్టెంబర్ 19 నుంచి ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ షో ప్రేక్షకులను అలరించబోతోంది.

2. సౌరవ్ గంగూలీ – దాదాగిరి అన్ లిమిటెడ్, బిగ్ బాస్ బంగ్లా

బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ మైదానంలోనే కాక స్మాల్ స్క్రీన్ పై కూడా సంచలనాలు సృష్టించారు. బెంగాలీలో అత్యంత ప్రజాదరణ పొందిన దాదాగిరి అన్ లిమిటెడ్ క్విజ్ షోను 2009 నుంచి విజయవంతంగా నడిపించారు. సుదీర్ఘకాలం పాటు సాగిన ఈ ప్రయాణంలో తనదైన టైమింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన బిగ్ బాస్ బంగ్లా మూడో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తూ బుల్లితెరపై తన మార్కు చూపిస్తున్నారు.

3. వీరేందర్ సెహ్వాగ్ – పవర్ ప్లే విత్ ఛాంపియన్స్

క్రీజులోకి వస్తే బౌలర్లకు చుక్కలు చూపించే వీరేందర్ సెహ్వాగ్, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై హోస్ట్‌గా అలరించారు. ఫ్లిప్‌కార్ట్ వీడియో తీసుకొచ్చిన పవర్ ప్లే విత్ ఛాంపియన్స్ అనే ఇంటరాక్టివ్ క్రికెట్ క్విజ్ షోకు ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించారు. టీవీ ప్రజెంటర్ సమీర్ కొచ్చార్‌తో కలసి మ్యాచుల విశ్లేషణలు, జోకులతో ప్రేక్షకులు సరైన సమాధానాలు ఊహించేలా ఈ షోను ఎంతో ఆసక్తికరంగా నడిపించారు.

4. శిఖర్ ధావన్ – క్రికెట్ దర్బార్

గబ్బర్ అని అభిమానులు పిలుచుకునే శిఖర్ ధావన్ తన సరదా స్వభావంతో ఓటీటీలోకి అడుగుపెట్టారు. జీ5 వేదికగా వచ్చిన క్రికెట్ దర్బార్ అనే స్పోర్ట్స్ కామెడీ వెబ్ సిరీస్‌లో టీవీ ప్రజెంటర్ ఆర్జే కిస్నాతో కలసి రచ్చ చేశారు. ఒక రాజులా దర్బార్ నిర్వహించి, క్రికెట్ వివాదాలు, ఆటగాళ్ల ప్రదర్శనలు, అభిమానుల అభిప్రాయాలను తనదైన శైలిలో విశ్లేషిస్తూ వినోదాన్ని పంచారు.

5. అజయ్ జడేజా – స్కార్పియో స్పీడ్‌స్టర్

భారతదేశంలోనే మొట్టమొదటి క్రికెట్ ఆధారిత రియాలిటీ షోగా స్కార్పియో స్పీడ్‌స్టర్ నిలిచింది. 2005లో ఛానల్ 7లో ప్రసారమైన ఈ షో ద్వారా దేశంలోనే అత్యంత వేగంగా బౌలింగ్ చేసే టాలెంటెడ్ పర్సన్లను వెలికితీశారు. ఈ 13 ఎపిసోడ్ల రియాలిటీ షోను భారత మాజీ కెప్టెన్ అజయ్ జడేజా హోస్ట్ చేయగా, పాకిస్థాన్ పేస్ దిగ్గజం వసీం అక్రమ్ జడ్జిగా వ్యవహరించారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *