రైల్వే ఉద్యోగులు ట్రైన్లల్లో ఉచితంగా ప్రయాణం సౌకర్యం అందుబాటులో ఉంటుందనే విషయం తెలిసిందే. ఇందుకోసం వారికి రైల్వేశాఖ ప్రత్యేక పాస్ జారీ చేస్తోంది. ఈ పాస్ ద్వారా రైల్వే ఉద్యోగులు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే ఇందుకు ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. కొన్ని సమయాల్లో డబ్బులు చెల్లించి కూడా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు ఏంటో తెలుసుకుందాం.
రైల్వే పాస్‌లకు కొన్ని పరిమితులు విధించారు. ఏ క్లాసులో ప్రయాణించవచ్చు..? ఎప్పుడెప్పుడు ఉపయోగించాలి? ఎన్నిసార్లు వాడుకోవచ్చు? అనే విషయంపై నిబంధనలు అమల్లో ఉన్నాయి. దీంతో ఎన్నిసార్లు అయినా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండదు. ఉద్యోగులకు అందించే ప్రత్యేక పాస్ అన్ని రైళ్లలోనూ వర్తిస్తుంది. కానీ కొన్ని రైళ్లల్లో ప్రత్యేక కండీషన్లు ఉంటాయి.
రాజధాని, శతాబ్ది, వందే భారత్, దురంతో, గతిమాన్ లాంటి ప్రీమియం రైళ్లల్లో కూడా పాస్ చెల్లుబాటు అవుతుంది. కానీ లగ్జరీ కంపార్ట్మెంటుల్లో ప్రయాణించలేరు. అదే విధంగా తమకు నచ్చిన కోచ్‌లో ప్రయాణించాలనుకుంటే కుదరదు. వందే భారత్ లాంటి ప్రీమియం రైళ్లల్లో వెళ్లాలనుకుంటే వారి జీతం, పదవి ఆధారంగా కేటాయించిన కోచ్‌లో వెళ్లాల్సి ఉంటుంది.
ఇక తమకు అర్హత ఉన్న కోచ్‌ల్లో కాకుండా వేరే కోచుల్లో ప్రయాణం చేయాలంటే ప్రివిలేజ్ టికెట్ ఆర్డర్ సౌకర్యం ఉంటుంది. ఈ సదుపాయం ద్వారా ఉద్యోగి, అతడి కుటుంబసభ్యులు టికెట్ ఛార్జీలో మూడింట ఒక వంతు చెల్లించాల్సి ఉంటుంది. దీని కోసం మందుగా టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రివిలేజ్ పాస్‌కు భిన్నంగా ఇది ఉంటుంది.
ఇక ఐఆర్సీటీసీ కొన్ని ప్రత్యేక పర్యాటక రైళ్లను ప్రవేశపెడుతూ ఉంటుంది. ఈ రైళ్లల్లో ఉద్యోగులకు ఉచిత ప్రయాణం ఉండదు. దీంతో ఇతర ప్రయాణికుల తరహాలోనే టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పాస్ ఉన్నంత మాత్రాన అపరిమిత ప్రయాణం చేయలేరు. ఈ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.




