మన ఆస్తులకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు పాడైపోయినా, కాలిపోయినా, కనిపించకుండా పోయినా మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన పనిలేదు. భారతీయ రిజిస్ట్రేషన్ చట్టం-1908 ప్రకారం మీరు కొన్ని న్యాయపరమైన ప్రక్రియలను ఫాలో అవ్వడం ద్వారా మీ ఆస్తిపై ఉన్న హక్కును రక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ న్యాయపరమైన ప్రక్రియలేంటి? ఆస్తి పత్రాలు పోతే తొలుత మనం చేయాల్సిన పనులేంటో చూద్దాం.
పోలీస్ కంప్లైంట్: ఒకవేళ మీ ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు పోతే.. మీరు వెంటనే స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయండి. అక్కడ పోలీసులు మీ వివరాలు తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసి నాన్-ట్రేసబుల్ సర్టిఫికెట్ ఇస్తారు. ఇలా చేయడం ద్వారా భవిష్యత్తులో మీ డాక్యుమెంట్లు దుర్వినియోగం అవ్వకుండా చట్టపరంగా రక్షణ లభిస్తుంది.
పేపర్ నోటీస్: మీ ఆస్తి పత్రాలు పోయినట్లు మీరు గుర్తిస్తే.. వెంటనే ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్, అలాగే మీ జిల్లా లేదా రాష్ట్ర వార్తాపత్రికలో మీ ఆస్తి వివరాలు, సర్వే నంబర్లు, పోయిన పత్రాల సమాచారాన్ని పేర్కొంటూ పబ్లిక్ ప్రకటన ఇవ్వండి. 15-21 రోజులలో దానికి సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే.. భవిష్యత్తులో ఏదైనా వివాదం తలెత్తినప్పుడు ఈ నోటీస్ కాపీ ఒక బలమైన సాక్ష్యంగా ఉపయోగపడుతుంది.
నోటరీ అఫిడవిట్: అలాగే భవిష్యత్తులో మీకు ఎలాంటి న్యాయపరమైన సమస్యలు రాకుండా ఉండేందుకు.. మీ ఆస్తి పత్రాలు ఎలా పోయాయో వివరంగా తెలుపుతూ ఒక నోటరీ సమక్షంలో అఫిడవిట్ చేయించుకోండి. ఇలా చేయడం ద్వారా మీరు భవిష్యత్తులో ఆస్తిని అమ్మాలనుకున్నా లేదా బ్యాంక్ వ్యవహారాలు పూర్తి చేసుకోవడానికైనా ఈ అఫిడవిట్, ఇండెమ్నిటీ బాండ్ ఎంతో ఉపయోగపడతాయి.
సబ్-రిజిస్ట్రార్ ఆఫీస్ సర్టిఫైడ్ కాపీ: భారతీయ రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 57 ప్రకారం.. రిజిస్ట్రేషన్ అయిన ప్రతి డాక్యుమెంట్ను ప్రభుత్వ రికార్డుల్లో భద్రంగా ఉంచుతారు. కాబట్టి మీ ఆస్తి పత్రాలు పోతే.. సంబంధిత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి సర్టిఫైడ్ కాపీ (Certified Copy) కోసం దరఖాస్తు చేసుకోండి. వారు మీకు అధికారిక సర్టిఫైడ్ కాపీని అందజేస్తారు. ఇది చట్టపరంగా ఒరిజినల్ పత్రంతో సమానమైన విలువను కలిగి ఉంటుంది.
బ్యాంకుల నిర్లక్ష్యం ఉంటే పరిహారం: మీరు మీ ఇంటి పత్రాలను బ్యాంకులో పెట్టి లోన్ తీసుకున్నప్పుడు.. ఆ బ్యాంక్ పొరపాటున మీ డాక్యుమెంట్లను పోగొడితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం పూర్తి బాధ్యత ఆ బ్యాంకుదే అవుతుంది. బ్యాంకు తమ సొంత ఖర్చులతో అవసరమైన పత్రాలను తిరిగి ఇప్పించడంతో పాటు బాధితుడికి తగిన నష్టపరిహారం కూడా చెల్లించాలి. కాబట్టి ఆస్తి పత్రాలు పోయినప్పుడు కంగారు పడకుండా ఈ చట్టపరమైన ప్రక్రియలను అనుసరించండి.





