Headlines

Kisan Credit Card: రైతులకు కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్.. రూ.5 లక్షల వరకు బెనిఫిట్.. పథకం పొడిగింపు.. | Kisan Credit Card: Modi Government May Extend Scheme Till 2032, Key Changes in Interest Subsidy


దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త అందించే సూచనలు కనిపిస్తున్నాయి. రైతన్నలకు కేంద్రం కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా తక్కువ వడ్డీకే బ్యాంక్ రుణాలు అందిస్తున్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా ఈ పథకం అమలవుతుండగా.. ఎంతోమంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు. అయితే ఈ పథకంపై మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోంది. ఈ స్కీమును 2032 వరకు పొడిగించాలని చూస్తోంది. దీని వల్ల రైతులు ఎప్పటిలాగే ఎలాంటి హామీ లేకుండా తక్కువ వడ్డీకి లోన్లు పొందవచ్చు. అయితే ఈ రుణాలు సకాలంలో తిరిగి చెల్లించేవారికి ఇచ్చే వడ్డీ రాయితీని స్వల్పంగా తగ్గించనుందని తెలుస్తోంది. 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించాలని ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.

2032 వరకు పొడిగింపు

ఆర్బీఐ పాలసీ రేట్లకు అనుగుణంగా వడ్డీ రాయితీకి సంబంధించి మార్పులు చేసేందుకు సంప్రదింపులు చేస్తోంది. ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ రెపో రేటును 125 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.25 శాతానికి సవరించింది. ఈ వడ్డీ రేట్లకు అనుగుణంగా కిసాన్ క్రెడిట్ కార్డు వడ్డీ రాయితీ ఉండేలా మార్పులు చేయనుంది. ప్రస్తుతం రూ.3 లక్షల రుణాలపై 7 శాతం వడ్డీ రేటు ఉంది. ప్రభుత్వ బ్యాంకులు 1.5 శాతం వడ్డీ రాయితీని అందిస్తున్నాయి. దీంతో వడ్డీ రాయితీపై ప్రభుత్వ బ్యాంకులతో కేంద్రం సంప్రదింపులు జరుుతోంది. అనంతరం ఈ పథకాన్ని 2031-32 ఆర్ధిక సంవత్సరం వరకు పొడిగించాలని చూస్తుంది.

ప్రాధమిక దశలో చర్చలు

ప్రస్తుతం బ్యాంకులతో చర్చలు ప్రాధమిక దశలో ఉన్నాయి. త్వరలోనే అధికారికంగా ఓ నిర్ణయం వెలువడవచ్చు. 2025 నుంచి కేంద్రం 1.5 శాతం వడ్డీ రాయితీని కొనసాగిస్తూ వస్తోంది. దీనిని 2025-26 వరకు పొడిగించింది. ఇప్పుడు గడువు ముగియడంతో పథకాన్ని పొడిగించాలని యోచిస్తోంది. అయితే వడ్డీ రేట్ల కోత వల్ల మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్(ఎంసిఎల్ఆర్) కూడా తగ్గింది. ప్రభుత్వం సూచించిన 50 బేసిస్ పాయింట్ల తగ్గింపును బ్యాంకులు ఇప్పుడు భరించగలవని ప్రభుత్వం భావిస్తోంది. అయితే 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.22,600 కోట్లు కేటాయించారు. రుణాలను సకాలంలో తిరిగి చెల్లించే రైతులకు 3 శాతం వరకు అదనపు వడ్డీ ప్రయోజనం అందిస్తోంది. దీనివల్ల కేవలం 4 శాతం వడ్డీతో రైతులకు రుణాలు అందుతున్నాయి. ఈ పథకం రుణ పరిమితిని కూడా రూ.5 లక్షలకు కేంద్రం ఇటీవల పెంచింది. దీంతో అర్హులైన రైతులు రూ.5 లక్షల వరకు రుణం పొందే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *