Headlines

Telangana: వెయ్యికే సూపర్ ట్రిప్.. ఒక్క రోజులోనే సాగర్ అందాలు, బౌద్ధ చరిత్ర.. ఆర్టీసీ అదిరే ప్లాన్.. | Hyderabad to Nagarjuna Sagar 1 Day Tour at Just Rs 1000: Telangana Tourism Launches Special Package


నాగార్జునసాగర్‌ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది డ్యామ్‌, కృష్ణమ్మ అందాలే. కానీ.. సాగర్‌ పరిసరాల్లో అంతకుమించిన చారిత్రక, బౌద్ధ పర్యాటక సంపద ఉంది. నాగార్జునకొండ, బుద్ధవనం ఇప్పుడు ఆ టూరిజం మ్యాప్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ ప్రాంతాన్ని మరింతగా పర్యాటకులకు చేరువ చేసేందుకు తెలంగాణ టూరిజం కీలక నిర్ణయం తీసుకుంది. బౌద్ధ చరిత్రను కళ్లముందుకు తెచ్చే నాగార్జునకొండ.. ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకున్న బుద్ధ వనాన్ని చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. సాధారణంగా హైదరాబాద్‌ నుంచి కుటుంబంతో కలిసి నాగార్జునసాగర్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తే ప్రయాణం, వాహనం, ఇతర ఖర్చులు కలిపి బడ్జెట్‌ పెరుగుతుంది. బుద్ధవనం అభివృద్ధి తర్వాత నాగార్జునసాగర్‌ టూరిజం పరిధి మరింత విస్తరించింది. అయితే.. పర్యాటకులు పెద్ద సంఖ్యలో రావాలంటే హైదరాబాద్‌ వంటి ప్రధాన నగరాల నుంచి కనెక్టివిటీ కీలకంగా మారింది. అందుకే ముఖ్యంగా హైదరాబాద్‌ వాసులు, విద్యార్థులు, కుటుంబాలు, బౌద్ధ చరిత్రపై ఆసక్తి ఉన్న పర్యాటకులను ఆకట్టుకునేలా తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది.

రూ.1,000కే నాగార్జునకొండ–బుద్ధవనం యాత్ర..

నాగార్జునకొండలోని బౌద్ధ చారిత్రక ఆనవాళ్లు.. బుద్ధవనంలోని ప్రత్యేక నిర్మాణాలు.. నాగార్జునసాగర్‌ ప్రకృతి అందాలను తిలకించేందుకు హైదరాబాద్ వాసులకు రూ.1,000కే ఈ ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ నెల 20 నుంచి ఈ యాత్రను ప్రారంభించేందుకు పర్యటకశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్యాకేజీలో ఏసీ వాహనంలో రవాణా, బోటింగ్ టికెట్లు, నాగార్జునకొండ మ్యూజియం, బుద్ధవనం ప్రవేశ టికెట్లు, ఒక లీటరు వాటర్ బాటిల్ అందుబాటులో ఉంటాయని పర్యాటకశాఖ తెలిపింది. అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం సౌకర్యాలు ఈ ప్యాకేజీలో ఉండవని అధికారులు స్పష్టం చేశారు. ఈ టూర్ లో భాగంగా హైదరాబాద్‌ నుంచి ఉదయం 6 గంటలకు ప్రత్యేక బస్సు బయలు దేరుతుంది.

హైదరాబాద్‌లో పికప్ పాయింట్ల ఇవే..

హైదరాబాద్ లోని బేగంపేట టూరిజం ప్లాజా నుంచి ఉదయం 6.00 గంటలకు వాహనం ప్రారంభమై..6.10 గంటలకు సంగీత ఎక్స్ రోడ్, 6.15గంటలకు ఉప్పల్ ఎక్స్ రోడ్, 6.20 గంటలకు ఎల్బీనగర్ ఎక్స్ రోడ్, 6.25 గంటలకు సాగర్ రింగ్ రోడ్ వద్ద ప్రయాణికులను పికప్ చేసుకుంటారు. నాగార్జునసాగర్‌ చేరుకున్న తర్వాత నాగార్జునకొండ, బుద్ధవనం సహా ప్రముఖ పర్యాటక ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంటుంది. టూర్ ముగిసిన తర్వాత రాత్రి 10.00 గంటల వరకు ప్రయాణికులను తిరిగి డ్రాప్ చేస్తారు.

ఒకే రోజులో చరిత్ర.. బౌద్ధం.. ప్రకృతి అందాలు.. ప్యాకేజీ ప్రత్యేకత..

ఈ టూర్ ప్యాకేజీ ప్రత్యేకత ఏంటంటే.. వన్‌డే ట్రిప్‌.. హైదరాబాద్‌ నుంచి ఉదయం బయలుదేరి.. నాగార్జునసాగర్‌లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించి.. తిరిగి అదే రోజు రాత్రి హైదరాబాద్‌కు చేరుకునేలా షెడ్యూల్‌ రూపొందించారు. నాగార్జునకొండలోని బౌద్ధ చారిత్రక ఆనవాళ్లు.. బుద్ధవనంలోని ప్రత్యేక నిర్మాణాలు.. నాగార్జునసాగర్‌ ప్రకృతి అందాలు.. ఇవన్నీ ఒకే ట్రిప్‌లో చూసే అవకాశం పర్యాటకులకు దక్కనుంది. అందుకే హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక బస్సు.. నిర్ణీత పికప్‌ పాయింట్లు.. తక్కువ ధర.. ఒకరోజు ప్యాకేజీ అనే కాన్సెప్ట్‌తో తెలంగాణ టూరిజం ముందుకెళ్తోంది.

బుకింగ్స్ షెురూ..

బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయని, ప్రయాణికుల అవసరాన్ని బట్టి కస్టమైజ్డ్ టూర్లను కూడా ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు వెల్లడించారు. టికెట్ల బుకింగ్స్ కోసం 9502002844 నంబర్ను సంప్రదించాలని సూచించారు.ఈ ప్రయోగం సక్సెస్‌ అయితే.. తెలంగాణలోని మరిన్ని పర్యాటక ప్రాంతాలకు కూడా ఇలాంటి వన్‌డే బడ్జెట్‌ టూర్‌ ప్యాకేజీలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *