టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సులకు మరింత మెరుగులు దిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో భాగంగా మెట్రో తరహాలోనే బస్సుల్లో సాంకేతికతతో కూడిన డిజిటల్ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం మెట్రోలో డిజిటల్ స్క్రీన్లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇందులో మెట్రో రూట్ మ్యాప్‌తో పాటు తర్వాతి స్టాపుల సమాచారం, అడ్వర్టైజ్‌మెంట్లను ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు అదే తరహాలో సిటీలోని ఆర్టీసీ బస్సులకు తీర్చిదిద్దనున్నారు. బస్సు లోపల డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేసేందుకు టీజీఎస్ఆర్టీసీ సిద్దమైంది. ఇందుకోసం రూట్ వేవ్ సంస్ధతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా హయత్ నగర్ డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సుల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు.
స్టాపుల సమాచారం
ఈ డిజిటల్ స్క్రీన్లతో పాటు ఇన్పోటైన్‌మెంట్ తెరలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ స్క్రీన్లలో తర్వాతి బస్టాప్ సమాచారం అందిస్తారు. అలాగే ప్రధాన స్టేజీలు, స్టాపుల పేర్లను ప్రదర్శిస్తారు. దీంతో ప్రయాణికులు సులువుగా తమ తర్వాత స్టాప్ వివరాలను తెలుసుకోవచ్చు. నగరానికి కొత్తగా వచ్చేవారికి స్టాపుల గురించి అవగాహన ఉండదు. అలాంటివారికి ఇది ఉపయోగపడుతుంది. నగరంలో ఉండేవారికి కూడా స్టాపుల గురించి అవగాహన ఉండదు. ఇలాంటప్పుడు రాబోయే స్టాప్ వివరాలను ముందుగానే తెలుసుకోవడం వల్ల తమ స్టాప్ వచ్చినప్పుడు దిగడానికి సహయపడుతుంది. అలాగే ఈ స్క్రీన్లపై వాణిజ్య ప్రకటనలను కూడా ప్రదర్శించనున్నారు. దీంతో ఆర్టీసీ ఆదాయం కూడా సమకూరుతుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే ఆర్టీసీ అందిస్తున్న వివిధ సేవలు, ప్రజా సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి కూడా ప్రజలకు సమాచారం అందిస్తున్నారు. ఇక ప్రయాణికులకు అవసరమైన ముఖ్యమైన సమాచారాన్ని కూడా ప్రదర్శిస్తారు.
ప్రకటనల ద్వారా ఆదాయం..
తొలుత హయత్ నగర్-పటాన్ చెర్వు మార్గంలో పది ఎలక్ట్రిక్ బస్సుల్లో పైలట్ ప్రాజెక్టుగా డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికుల నుంచి వచ్చే స్పందనను బట్టి అన్ని బస్సుల్లో ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా ప్రజలకు సమాచారం అందించడంతో పాటు వాణిజ్య ప్రకటనల తర్వాత ఆర్టీసీకి అదనపు ఆదాయం సమకూరనుంది. గతంలో బస్సులను డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేసినప్పటికీ.. కేవలం వినోదం, వాణిజ్య ప్రకటనల కోసం మాత్రమే వినియోగించేవారు. ఇప్పుడు కొత్తగా తీసుకొస్తు్న్న వ్యవస్థ ద్వారా వాణిజ్య ప్రకటనలతో పాటు ప్రజలకు సమాచారం అందించనున్నారు. సమాచార వేదికలుగా వీటిని ఉపయోగించుకోవాలని ఆర్టీసీ చూస్తోంది. ప్రకటనల రూపంలో నాన్ ఫేర్ రెవెన్యూను పెంచుకోవడం ద్వారా ఆర్ధికంగా మరింత బలోపేతం కావచ్చని అధికారులు చెబుతున్నారు.