Headlines

Vaibhav Sooryavanshi : వైభవ్ సూర్యవంశీకి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా? | Vaibhav Sooryavanshi Faces Career Defining Test in Zimbabwe T20 Series After England Setback

Vaibhav Sooryavanshi : వైభవ్ సూర్యవంశీకి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా? | Vaibhav Sooryavanshi Faces Career Defining Test in Zimbabwe T20 Series After England Setback


Vaibhav Sooryavanshi : ఐపీఎల్‌లో ఆకాశమే హద్దుగా విరుచుకుపడి ప్రపంచాన్ని ఆకర్షించిన భారత యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి అంతర్జాతీయ వేదికపై అసలైన పరీక్ష ఎదురవుతోంది. దిగ్గజ బౌలర్లను సైతం లెక్కచేయకుండా చిత్తు చేసిన ఈ కుర్రాడిని ఐపీఎల్ తర్వాత అందరూ పిల్లోడు కాదు, పిడుగు అని ఆకాశానికెత్తేశారు. అతడి విధ్వంసకర బ్యాటింగ్ చూసి జాతీయ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు జోరందుకున్నాయి. అయితే టీమిండియాలోకి అడుగుపెట్టిన తర్వాత వచ్చిన అవకాశాల్లో విఫలమై, అంతర్జాతీయ స్థాయికి తను ఇంకా పూర్తి స్థాయిలో రెడీ కాలేదనే విమర్శలను ఎదుర్కొన్నాడు. ఇప్పుడు జింబాబ్వే సిరీస్ రూపంలో అతడికి మరో సువర్ణావకాశం లభించింది.

గత ఐపీఎల్ సీజన్‌లో ఏకంగా 776 పరుగులు సాధించి అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచిన వైభవ్ సూర్యవంశీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజాల కంటే ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. టి20ల్లో బ్యాటర్లు ఆడాల్సిన తీరునే మార్చేస్తూ అతడు చూపిన దూకుడు సెలక్టర్లను సైతం మైమరిపించింది. ఈ క్రమంలోనే ఐర్లాండ్ పర్యటనకు వైభవ్‌ను ఎంపిక చేయక తప్పలేదు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో బెంచ్‌కే పరిమితమైన అతడు, ఆ తర్వాత వచ్చిన మూడు అవకాశాల్లో 14, 13, 15 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో అతడి మెరుపులు కేవలం ఐపీఎల్ ఫ్లాట్ పిచ్‌లకే పరిమితమంటూ విమర్శకులు పెదవి విరిచారు.

ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి టీ20లో వైభవ్‌ను పక్కనబెట్టి సంజు శామ్సన్‌ను ఆడించారు. అయితే గురువారం నుంచి ప్రారంభంకానున్న జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్‌కు సంజు దూరమవడంతో, అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం వైభవ్‌కే దక్కనుంది. జింబాబ్వే కాస్త తేలికైన ప్రత్యర్థి కావడంతో తనపై పడ్డ విమర్శల ముద్రను చెరిపేసుకుని, తాను నిజంగానే అంతర్జాతీయ క్రికెట్‌కు తగిన వాడినని నిరూపించుకోవడానికి వైభవ్‌కు ఇది సరైన సమయం.

తొలి బంతి నుంచే బాదుడే ధ్యేయంగా ఆడడం వైభవ్ నైజం. భారతీయ పిచ్‌లపై ఈ శైలి వర్కవుట్ అయినప్పటికీ, పేస్, స్వింగ్, బౌన్స్ ఉండే విదేశీ వికెట్లపై ప్రతి బంతినీ అడ్డదిడ్డంగా బాదడం కుదరదు. బంతిని గమనించి, క్రీజులో నిలదొక్కుకునే వరకు కాస్త ఓపిక పట్టడం నేర్చుకోవాలి. ప్రస్తుతం భారత జట్టులో ఓపెనింగ్ స్థానానికి తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోతే జట్టులో చోటు ప్రశ్నార్థకంగా మారుతుంది. అంతేకా జింబాబ్వే జట్టులో ముజరబాని, ఎంగరవ వంటి ఫాస్ట్ బౌలర్లతో పాటు సికందర్ రజా వంటి మేటి స్పిన్నర్ ఉన్నందున ఆ జట్టును తక్కువ అంచనా వేయకుండా ప్రణాళికాబద్ధంగా ఆడాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి : Vaibhav Sooryavanshi : మ్యాచ్ చూడటానికి రాజస్థాన్ నుంచి జింబాబ్వే‎కు వృద్ధురాలు.. వైభవ్ క్రేజ్ వేరే లెవెల్ అంతే

ఇంగ్లాండ్ సిరీస్‌లో వైభవ్ బలహీనత స్పష్టంగా బయటపడింది. గుడ్ లెంత్, షార్ట్ పిచ్ బంతులను బౌన్స్ చేస్తూ వేసినప్పుడు వైభవ్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్ వేసిన షార్ట్ బంతులకు పుల్ షాట్ ఆడబోయి రెండుసార్లు గాల్లోకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఐపీఎల్‌లో పిచ్‌ల వేగం తక్కువగా ఉండటంతో అలాంటి బంతులను సిక్సర్లుగా మలిచినప్పటికీ, ఎక్కువ వేగంతో వచ్చే బంతులకు అతడు వికెట్ సమర్పించుకుంటున్నాడు. ప్రత్యర్థి బౌలర్లు ఈ వ్యూహంతోనే దాడి చేసే అవకాశం ఉన్నందున, వైభవ్ తన టెక్నిక్‌ను మెరుగుపరుచుకుని బౌన్సర్ల బలహీనతను అధిగమించాల్సి ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *