Headlines

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్ .. రైతు బజార్లలో తక్కువ ధరకే బియ్యం విక్రయం.. పూర్తి వివరాలు ఇవే! | AP Government to Sell Super Fine Rice at ₹52/kg from August 1 to Curb Rising Prices

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్ .. రైతు బజార్లలో తక్కువ ధరకే బియ్యం విక్రయం.. పూర్తి వివరాలు ఇవే! | AP Government to Sell Super Fine Rice at ₹52/kg from August 1 to Curb Rising Prices


రాష్ట్రంలో బియ్యం ధరలు నెల నెలా పెరుగుతుండటంతో సామాన్యులపై భారం పెరుగుతోంది. మార్కెట్లో సూపర్ ఫైన్, పచ్చిబియ్యం ధరలు సామాన్యులకు అందనంత స్థాయికి చేరుతున్నాయనే ఫిర్యాదులు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున అందాయి. ప్రపంచ యుద్ధ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం, రవాణా వ్యయాల పెరుగుదల వంటి కారణాలతో ధరలు పెరుగుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం… ఇక నేరుగా మార్కెట్‌లో జోక్యం చేసుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగానే రైస్ మిల్లర్లతో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.

ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుంది?

బియ్యం ధరల పెరుగుదలపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ప్రతి నెలా ధరల్లో మార్పులు రావడం, మార్కెట్‌లో సూపర్ ఫైన్ బియ్యం అరవై రూపాయలకు పైగా విక్రయమవుతుండటం, పచ్చిబియ్యం ధర కూడా నిరంతరం పెరుగుతుండటంతో ధరల నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. దీనిపై రైస్ మిల్లర్లతో సమావేశమైన మంత్రి నాదెండ్ల మనోహర్… ధరల స్థిరీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

ఏం నిర్ణయం తీసుకుంది?

ఆగస్టు ఒకటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 130 రైతు బజార్లు, మరో 500 ప్రత్యేక విక్రయ కేంద్రాల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం మార్కెట్లో రూ.62 నుంచి రూ.65 వరకు ఉన్న బీపీటీ సూపర్ ఫైన్ బియ్యాన్ని కిలో రూ.52కే… రూ.58 వరకు విక్రయమవుతున్న పచ్చిబియ్యాన్ని కిలో రూ.50కే అందించనుంది. ఈ విక్రయాలన్నీ ప్రభుత్వ పర్యవేక్షణలోనే జరుగుతాయని మంత్రి తెలిపారు.

మధ్యవర్తులకు చెక్

బియ్యం ధరలు అదుపులో ఉండాలంటే మధ్యవర్తుల పాత్ర తగ్గాల్సిందేనని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే జిల్లాల వారీగా రైస్ మిల్లర్ల సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. బియ్యం పక్కదారి పట్టకుండా ఆధార్ లేదా బయోమెట్రిక్ ధృవీకరణతో విక్రయాలు నిర్వహించాలని నిర్ణయించింది. దీనివల్ల నాణ్యమైన బియ్యం నేరుగా వినియోగదారులకే చేరుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

బ్రాండ్ ఏపీపై ఫోకస్

ధరల నియంత్రణతో పాటు నాణ్యమైన ఆంధ్రప్రదేశ్ బియ్యాన్ని జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో మరింత గుర్తింపు తీసుకురావడంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. రైతులు, రైస్ మిల్లర్లతో సమన్వయం పెంచి ఎగుమతులను ప్రోత్సహించాలని భావిస్తోంది. ‘బ్రాండ్ ఏపీ’ పేరుతో రాష్ట్ర బియ్యానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మొత్తానికి… పెరుగుతున్న బియ్యం ధరలతో సామాన్యులపై పడుతున్న భారం తగ్గించడంతో పాటు, మార్కెట్‌లో ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం మరోసారి ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంది. ఈ నిర్ణయం వల్ల వినియోగదారులకు ఎంత మేర ఊరట లభిస్తుంది. మార్కెట్ ధరలపై ఎలాంటి ప్రభావం పడుతుందన్నది ఆగస్టు ఒకటి నుంచి స్పష్టంకానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *