Headlines

కొత్తరకం డీజిల్ వచ్చేసింది.. మైనస్ 42 డిగ్రీల చలిలో కూడా పనిచేస్తుంది..! | What is XWG Diesel? India’s New Extreme Weather Fuel That Works Even at 42°C Explained

కొత్తరకం డీజిల్ వచ్చేసింది.. మైనస్ 42 డిగ్రీల చలిలో కూడా పనిచేస్తుంది..! | What is XWG Diesel? India’s New Extreme Weather Fuel That Works Even at 42°C Explained


పెట్రోల్, ప్రీమియం పెట్రోల్, డీజిల్ గురించి అందరికీ తెలుసు.. ఇవి సాధారణంగా అన్ని వాహనాల్లో వినియోగించే ఇంధనాలు. అయితే కొత్తగా XWG డీజిల్ అందుబాటులోకి వచ్చింది. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఎక్స్‌ట్రీమ్ వెదర్ గ్రేడ్ (ఎక్స్‌డబ్ల్యూజీ) డీజిల్ ఇది. సాధారణ డీజిల్ కాదు భారత ఆర్మీ , సైనిక యుద్ధ వాహనాల్లో, అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో ఉపయోగించే డీజిల్. భారత ఆర్మీ, చమురు మార్కెటింగ్ సంస్థలు సంయుక్తంగా తయారు చేసిన ప్రత్యేక ఇంధనం ఇది. కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో రక్షణ, రవాణా వాహనాల గమనాన్ని, భద్రతను, కార్యాచరణ సామర్థ్యాన్ని ఇది మెరుగుపరుస్తుంది. అత్యంత ఎత్తయిన ప్రాంతాలు, అత్యంత శీతల ప్రాంతాల్లో ఈ డీజిల్ ప్రజలకు ఎంతో ఉపయోగ పడనుంది.

అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద సాధారణ డీజిలు చిక్కగా మారి, ఇంధన ఫిల్టర్లను మూసుకుపోయేలా చేస్తుంది. ఫలితంగా అధిక ఎత్తుల్లో, మంచు ప్రాంతాల్లో వాహనాల పనితీరు ప్రభావితమవుతుంది. ఈ సవాలును ఎక్స్‌డబ్ల్యూజీ డీజిల్ అధిగమిస్తుంది. మైనస్ 42 డిగ్రీల సెల్సియస్ లాంటి అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద సైతం ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. సాధారణ డీజిల్ తీవ్రమైన చలిలో గడ్డకట్టుకుపోతుంది లేదా ఇంజిన్ స్టార్ట్ కావడంలో సమస్యలు తలెత్తుతాయి. కానీ ఈ XWG డీజిల్ అతి శీతల పరిస్థితుల్లోనూ వాహనాలు సజావుగా పనిచేసేలా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంజిన్ స్టార్ట్ అయ్యేలా సహాయపడుతుంది. బీఎస్-VI ప్రమాణాలు, ఐఎస్ 1460:2025 ప్రత్యేకతలకు అనుగుణంగా ఉండటంతో సైన్యంలో ఇప్పటికే వినియోగిస్తున్న పాత వాహనాల్లో సైతం దీనిని ఉపయోగించవచ్చు. దీనికోసం ఎలాంటి ఇంజిన్ మార్పులు లేదా రీ-హోమోలోగేషన్ అవసరం లేదు

XWG డీజిల్ ఉపయోగించే వాహనాలు

ఇది భారతీయ సైన్యం కోసం భారత్ పెట్రోలియం (BPCL) సహకారంతో ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన అత్యంత శీతల వాతావరణ ఇంధనం.ఈ ప్రత్యేకమైన డీజిల్‌ను ప్రధానంగా తక్కువ ఉష్ణోగ్రతలు (గడ్డకట్టే చలి -40°C నుండి -42°C వరకు) ఉండే అత్యున్నత పర్వత ప్రాంతాలు సరిహద్దుల్లో లడఖ్ వంటి ప్రాంతాలలో మోహరించే సైనిక వాహనాలలో వినియోగిస్తారు. ఈ ఇంధనాన్ని ఉపయోగించే యుద్ధ ట్యాంకులు ( T-90 భీష్మ, T-72 అజేయ,BMP-2 సారథ్), ఇన్ఫాంట్రీ కంబాట్ వాహనాలు, సైనిక లాజిస్టిక్స్ ట్రక్కులు, అంబులెన్స్లు, ఎమర్జెన్సీ వాహనాలు, సైనిక వాహనాల చమురు ట్యాంకులు, రవాణా వాహనాలలో వినియోగిస్తారు. సైనికపరమైన అవసరాలకు మాత్రమే కాకుండా కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో పనిచేసే వాహనాలు, పరికరాల విశ్వసనీయతను, భద్రతను మెరుగుపరిచి అత్యంత ఎత్తయిన, అత్యల్ప ఉష్ణోగ్రతలున్న ప్రదేశాల్లో నివసించే లఢక్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల పౌరులకు కూడా ఈ డీజిల్ ఉపయోగపడనుంది.

XWG డీజిల్ అసలైన గేమ్ ఛేంజర్

ఈ డీజిల్ ను సైనిక దళాల ప్రధానాధికారి (సీవోఏఎస్) జనరల్ ధీరజ్ సేథ్ ఢిల్లీలో ఆవిష్కరించారు.అత్యున్నత పర్వత ప్రాంతాలు మరియు తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఉండే సరిహద్దుల్లో సైనిక ఆపరేషన్లకు ఈ ఇంధనం ఒక అసలైన గేమ్ ఛేంజర్ అని ఆయన అభివర్ణించారు.గతంలో తీవ్రమైన చలిలో వాహనాలు గడ్డకట్టకుండా ఉండేందుకు డ్రైవర్లు రాత్రి సమయంలో వాహనాలను పదే పదే స్టార్ట్ చేయడం, ట్యాంకుల కింద హీటర్లు పెట్టడం వంటి ప్రమాదకరమైన పద్ధతులు అవసరమయ్యేవని, ఈ కొత్త డీజిల్ ఆ కష్టాలన్నింటినీ తొలగించి సైనికుల భద్రతను, మనోధైర్యాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. ఆర్మీ దేశీయ పెట్రోలియం సంస్థల సహకారంతో కేవలం ఒక్క సంవత్సరంలోనే ఈ ఇంధనాన్ని తయారు చేయడం ఆత్మనిర్భర్ భారత్ నినాదానికి ఒక చక్కటి నిదర్శనమని కొనియాడారు. ఎలాంటి ఇంజిన్ మార్పులు చేయకుండానే సైన్యం వద్ద ఉన్న ప్రస్తుత వాహనాలన్నింటిలోనూ -42°C వరకు చలిలో కూడా ఇది నేరుగా పనిచేస్తుందని, ఇది సైనిక బలగాల వేగవంతమైన కదలికలకు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *