Headlines

చనిపోయినా ముగ్గురికి పునర్జన్మ.. 18 ఏళ్ల యువకుడి అవయవ దానంతో నిలిచిన ప్రాణాలు! | Keesaragutta Accident: Hyderabad Brain Dead Youth Bunny Donates Organs, Saves 3 Lives


కంటికి రెప్పలా చూసుకున్న కుమారుడు బ్రెయిన్ డెడ్‌తో తనువు చాలించాడని తెలిసి, పుట్టెడు దుఃఖంలోనూ ఆ తండ్రి తీసుకున్న నిర్ణయం ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపింది. రంగారెడ్డి జిల్లా కీసర మండలం అంకిరెడ్డిపల్లికి చెందిన 18 ఏళ్ల పండుగ బన్నీ ఆగస్టు 21న కీసరగుట్ట సమీపంలో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన బన్నీని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యుల అత్యవసర వైద్యం అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆగస్టు 25 ఉదయం 6:30 గంటలకు వైద్యులు బన్నీని బ్రెయిన్ డెడ్ గా ప్రకటించారు.

కడుపుకోతను దిగమింగుకుని, కొడుకు జ్ఞాపకాలు నిరంతరం సమాజంలో సజీవంగా ఉండాలని బన్నీ తండ్రి పండుగ లక్ష్మీనారాయణ భావించారు. తెలంగాణ ప్రభుత్వ అవయవ దాన కార్యక్రమం జీవన్‌దాన్ అధికారుల అవగాహనతో, తన కుమారుడి అవయవాలను దానం చేయడానికి ముందుకు వచ్చారు. బన్నీ శరీరం నుంచి 2 కిడ్నీలు, 1 లివర్‌ను సేకరించిన వైద్యులు, అత్యవసర పరిస్థితిలో ఉన్న ముగ్గురు బాధితులకు శస్త్రచికిత్సల ద్వారా అమర్చి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. నింగికెగసిన చిన్నారి ప్రాణం.. ముగ్గురి రూపంలో ఈ సమాజంలో మళ్లీ ఊపిరి పోసుకుంది.

బన్నీ కుటుంబ సభ్యులు చూపిన మహోన్నతమైన ఉదారతను, తండ్రి లక్ష్మీనారాయణ ధైర్యాన్ని తెలంగాణ జీవన్‌దాన్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు, ప్రతినిధులు కొనియాడారు. వారి నిర్ణయం సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమని శ్లాఘించారు. 2026 సంవత్సరంలో తెలంగాణ జీవన్‌దాన్ కార్యక్రమం ద్వారా నమోదైన 140వ బ్రెయిన్ డెడ్ అవయవ దానంగా ఇది నిలిచింది. కష్టకాలంలోనూ అవయవ దానానికి ముందుకు వచ్చి ముగ్గురి ప్రాణాలు కాపాడిన బన్నీ కుటుంబానికి పలువురు శ్రద్ధాంజలి ఘటిస్తూ అభినందనలు తెలుపుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *