ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లో గల తన అధికారిక నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. విక్సిత్ భారత్ లక్ష్యాల సాధన దిశగా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సామాజిక సంక్షేమం, యువత, క్రీడలు తదితర కీలక రంగాల్లో జరుగుతున్న పురోగతిని కార్యదర్శులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రజల సంక్షేమమే అన్ని సంస్కరణలకు కేంద్రబిందువుగా ఉండాలని ప్రధాని స్పష్టం చేశారు. పౌరుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించే సంస్కరణలే దేశంలో నిజమైన మార్పును తీసుకురాగలవని మోదీ అన్నారు. ప్రభుత్వ పనితీరును మెరుగుపరచడమే కాకుండా, భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే ప్రక్రియను వేగవంతం చేయడం కూడా సంస్కరణల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పరిపాలనా వ్యవస్థలు మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రధాని సూచించారు. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో కొత్త అవసరాలను గుర్తించి, వాటిపై సమగ్ర మ్యాపింగ్ చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. దేశ అభివృద్ధి లక్ష్యాల సాధనకు హోల్-ఆఫ్-గవర్నమెంట్ విధానం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. విక్సిత్ భారత్ లక్ష్యం ప్రజా ఉద్యమంగా మారాలని, అందులో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. యువతలో పెరుగుతున్న మాదకద్రవ్యాల దుర్వినియోగంపై కూడా ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. యువతకు సంబంధించిన కార్యక్రమాల్లో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసేలా ప్రత్యేక వ్యవస్థను రూపొందించాలని సూచించారు. అలాగే క్రీడల అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ అవసరమని, భారతదేశం భవిష్యత్తులో ప్రధాన అంతర్జాతీయ క్రీడా పోటీలకు ఆతిథ్యం ఇచ్చే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. క్రీడా రంగంలో సాంకేతికత, స్టార్టప్‌ల పాత్రను మరింత ప్రోత్సహించాలని సూచించారు.
వ్యవసాయ రంగంలో పీఎం కుసుమ్ వంటి పథకాల అమలు రైతుల ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని అన్నారు. భవిష్యత్ ప్రపంచ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను రూపొందించాలని, ప్రపంచ స్థాయి నైపుణ్య అవసరాలపై మ్యాపింగ్ చేపట్టాలని అధికారులకు సూచించారు. సమావేశంలో వివిధ శాఖల కార్యదర్శులు తమ తమ రంగాల్లో అమలవుతున్న కార్యక్రమాలు, ఎదురవుతున్న సవాళ్లను వివరించారు. ప్రధానమంత్రి భవిష్యత్ కార్యాచరణపై కీలక సూచనలు చేశారు. సమర్థవంతమైన అమలు, శాఖల మధ్య సమన్వయం, వేగవంతమైన పురోగతితో విక్సిత్ భారత్ లక్ష్యాలను సాధించేందుకు కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో క్యాబినెట్ కార్యదర్శితో పాటు కీలక మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.