తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో ఆర్థికంగా వెనుకబడిన వారికి రవాణా సౌకర్యం కల్పించే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం. సొంత వాహనం కొనుగోలు చేసే స్థోమత లేని ఎమ్మెల్యేలకు ప్రభుత్వం తరఫున కారు, వ్యక్తిగత సహాయకుడిని అందించే ప్రతిపాదనపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన పలువురు అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ముఖ్యంగా అధికార టీవీకే పార్టీలో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేల సంఖ్య గణనీయంగా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలకు ముందు పార్టీ అధినేత విజయ్.. సాధారణ కార్యకర్తలు, ఆటో డ్రైవర్లు, కూలీలు, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారికి కూడా రాజకీయ అవకాశాలు కల్పించినట్లు పేర్కొంటున్నారు.
ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గంలో నిరంతరం పర్యటించడం, ప్రజల సమస్యలు తెలుసుకోవడం, అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించడం, అధికారులతో సమావేశాలకు హాజరుకావడం వంటి బాధ్యతలు ఉంటాయి. అలాగే రాష్ట్ర రాజధానికి తరచూ వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. దీంతో సొంత వాహనం లేని ఎమ్మెల్యేలకు ప్రయాణం పెద్ద సమస్యగా మారుతోంది.
ఇదే విషయాన్ని అసెంబ్లీలో కాటుమన్నార్కోయిల్ ఎమ్మెల్యే జ్యోతిమణి ప్రస్తావించారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలువురు ఎమ్మెల్యేలకు కనీస రవాణా సౌకర్యాలు కూడా లేవని ఆమె పేర్కొన్నారు. ప్రజలకు అవినీతి రహితంగా సేవ చేయాలంటే నియోజకవర్గాల్లో తిరిగేందుకు అవసరమైన రవాణా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై స్పీకర్ ప్రభాకర్ స్పందిస్తూ.. సొంత వాహనాలు లేని ఎమ్మెల్యేల వివరాలను సేకరించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
ఈ అంశంపై ముఖ్యమంత్రి విజయ్ కూడా సానుకూలంగా స్పందించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ సొంత కారు లేని ఎమ్మెల్యేలను గుర్తించి, వారికి ప్రభుత్వ వాహనం, వ్యక్తిగత సహాయకుడిని అందించే విధంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అధికారిక నిర్ణయం వస్తే.. తొలిసారి ఎన్నికైన, ఆర్థికంగా వెనుకబడిన ప్రజాప్రతినిధులకు ఇది కీలక సహాయంగా మారనుంది. ప్రజాసేవ కోసం వచ్చిన సామాన్య ఎమ్మెల్యేలకు కనీస వసతులు కల్పించాలనే డిమాండ్‌కు ఇది పరిష్కారంగా నిలిచే అవకాశం ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..