Headlines

ఫోన్ చూపిస్తూ తినిపిస్తున్నారా.. పిల్లల పొట్టలో జరిగేది తెలిస్తే మైండ్ బ్లాంకే.. | Why You Should Never Feed Kids While They Watch Phone Reels, Doctor Warns


ఈ రోజుల్లో చాలామంది ఇళ్లలో సాధారణంగా కనిపించే సీన్ ఒక్కటే.. ఒక చేతిలో అన్నం ముద్ద, మరో చేతిలో స్మార్ట్‌ఫోన్.. పిల్లలు మారాం చేయకుండా.. నిశబ్దంగా తింటున్నారన్న ఉద్దేశంతో తల్లిదండ్రులే స్వయంగా వారి చేతికి మొబైల్ ఇచ్చి షార్ట్స్, రీల్స్ పెట్టిస్తుంటారు. అయితే ఇలా స్క్రీన్ చూస్తూ ఆహారం తీసుకోవడం వల్ల పిల్లల జీర్ణవ్యవస్థ తీవ్రంగా దెబ్బతినడమే కాకుండా వారిని ప్రమాదకరమైన ఊబకాయం వైపు నెడుతోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి కొన్ని సెకన్లకు మారే కొత్త వీడియోలు మెదడులో డోపమైన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తాయి. దీంతో ప్రతిసారీ కొత్త కంటెంట్ చూడాలనే కోరిక పెరిగి, పిల్లలు రీల్స్‌కు తీవ్రంగా బానిసలవుతున్నారు. పెద్దలే ఈ వ్యసనాన్ని నియంత్రించుకోలేకపోతున్న తరుణంలో చిన్నారులు దానికి మరింత సులువుగా ఆకర్షితులవుతున్నారు.

జీర్ణక్రియపై తీవ్ర ప్రభావం – నిపుణుల హెచ్చరిక

పిల్లలు ఫోన్ చూస్తూ తినడం వల్ల కలిగే నష్టాలపై ఉజాలా సిగ్నస్ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ డాక్టర్ శుచిన్ బజాజ్ కీలక విషయాలను వెల్లడించారు. దృష్టి మొత్తం స్క్రీన్‌పై ఉండటం వల్ల పిల్లలు ఆహారాన్ని సరిగ్గా నమలరు. పెద్ద పెద్ద ముద్దలను నేరుగా మింగేస్తారు. సరిగ్గా నమలని ఆహారం జీర్ణాశయంలోకి వెళ్లడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, తీవ్రమైన అజీర్ణం, కడుపులో భారం వంటి సమస్యలు తలెత్తుతాయి.

అతిగా తినడం – ఊబకాయం ముప్పు

సాధారణంగా మనం ఆహారం తీసుకునేటప్పుడు కడుపు నిండిందనే సంకేతం మెదడుకు చేరడానికి కొంత సమయం పడుతుంది. కానీ మెదడు రీల్స్‌లోని దృశ్యాలతో నిమగ్నమై ఉన్నప్పుడు, అది శరీరం పంపే కడుపు నిండింది అనే సంకేతాలను గుర్తించలేదు. ఫలితంగా పిల్లలు తమకు తెలియకుండానే అవసరానికి మించి ఎక్కువగా తింటారు.

ప్రాసెస్డ్ ఫుడ్స్‌తో రెట్టింపు ముప్పు

స్క్రీన్ చూస్తూ చిప్స్, బిస్కెట్లు, ఇతర ప్యాక్ చేసిన అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహార పదార్థాలు తినడం వల్ల శరీరంలో క్యాలరీలు వేగంగా పేరుకుపోతాయి. ఇది దీర్ఘకాలంలో బాల్య ఊబకాయం , తీవ్రమైన మలబద్ధకం, అనారోగ్యకరమైన జీవనశైలి సమస్యలకు దారితీస్తుంది.

తల్లిదండ్రులు ఏం చేయాలి?

తినడం అనేది కేవలం యాంత్రికంగా ముగించే పని కాదు.. ఆహారం రుచిని, వాసనను ఆస్వాదిస్తూ ఏకాగ్రతతో చేయాల్సిన ప్రక్రియ.

  • ఆహారం తినిపించే సమయంలో ఫోన్లు, టీవీలు పూర్తిగా దూరంగా ఉంచాలి.
  • పిల్లలను ఆహారాన్ని నిదానంగా, బాగా నమిలి తినేలా అలవాటు చేయాలి.
  • భోజన సమయాన్ని కుటుంబ సభ్యులంతా కలిసి మాట్లాడే సమయంగా మార్చుకోవాలి.

పిల్లలకు కేవలం పోషకాహారం ఇవ్వడమే కాదు.. ఆ ఆహారాన్ని ఆరోగ్యకరమైన పద్ధతిలో ఎలా తినాలో నేర్పించడం కూడా తల్లిదండ్రుల బాధ్యత అని వైద్యులు గుర్తుచేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *