Headlines

మనసు గందరగోళంగా ఉంటే ఏం చేయాలి? బుద్ధుడి కథలో గొప్ప జీవిత సత్యం | When the Mind Is Troubled, Let Things Settle: Gautama Buddha Motivational Story

మనసు గందరగోళంగా ఉంటే ఏం చేయాలి? బుద్ధుడి కథలో గొప్ప జీవిత సత్యం | When the Mind Is Troubled, Let Things Settle: Gautama Buddha Motivational Story


మన మనసులో గందరగోళం, భయం, బాధ, ఆందోళన వంటి భావోద్వాగాలు ఉన్నప్పుడు ఎలా స్పందించాలి? దీని గురించి ఎంతో సరళంగా వివరించే ఓ చిన్న కథ గౌతమ బుద్ధుడికి సంబంధించినది ప్రచారంలో ఉంది. ఒకసారి బుద్ధుడు తన కొంతమంది శిష్యులతో కలిసి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తున్నారు. మార్గమధ్యంలో వారికి ఓ సరస్సు కనిపించింది. బుద్ధుడికి దాహం వేయడంతో ఓ శిష్యుడిని పిలిచి..“నాకు దాహంగా ఉంది. ఆ సరస్సు నుంచి కొంచెం నీళ్లు తీసుకురా” అని చెప్పారు.

శిష్యుడు వెంటనే సరస్సు దగ్గరకు వెళ్లాడు. అయితే అక్కడ కొంతమంది బట్టలు ఉతుకుతున్నారు. అదే సమయంలో ఓ ఎద్దుల బండి సరస్సు అంచు నుంచి వెళ్లడంతో నీరు మొత్తం కలుషితమైంది. మట్టి పైకి లేచి నీరు బురదగా మారిపోయింది. ఆ నీటిని చూసిన శిష్యుడు.. “ఈ నీటిని గురువికి ఎలా ఇస్తాను? ఇది తాగడానికి ఏమాత్రం పనికిరాదు” అని భావించి ఖాళీ చేతులతో తిరిగి వచ్చాడు.

సరస్సులోని నీరు మురికిగా మారిన విషయాన్ని శిష్యుడు బుద్ధుడికి చెప్పాడు. బుద్ధుడు మాత్రం ఎలాంటి ఆందోళన చెందలేదు. “సరే.. కాసేపు ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకుందాం” అని అన్నారు. దాదాపు అరగంట తర్వాత బుద్ధుడు మళ్లీ అదే శిష్యుడిని సరస్సు దగ్గరకు వెళ్లి నీళ్లు తీసుకురమ్మని చెప్పారు. ఈసారి శిష్యుడు సరస్సు దగ్గరకు వెళ్లి ఆశ్చర్యపోయాడు. కొద్దిసేపటి క్రితం బురదగా కనిపించిన నీరు ఇప్పుడు ఎంతో స్పష్టంగా, శుభ్రంగా ఉంది. నీటిలోని మట్టి మొత్తం కిందికి చేరిపోయింది. పైభాగంలో స్వచ్ఛమైన నీరు కనిపించింది. శిష్యుడు ఆ నీటిని పాత్రలో తీసుకుని బుద్ధుడి దగ్గరకు తీసుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి



బుద్ధుడు చెప్పిన జీవిత సత్యం

బుద్ధుడు ఆ నీటిని చూసి శిష్యుడితో ఇలా చెప్పారు: “చూశావా.. నువ్వు ఆ నీటిని అలాగే వదిలేశావు. కొంత సమయం గడిచిన తర్వాత మట్టి తనంతట తానే కిందికి చేరుకుంది. నీరు స్వచ్ఛంగా మారింది. దాని కోసం నువ్వు ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన అవసరం రాలేదు.” అక్కడితో ఆగకుండా బుద్ధుడు మనసుకు, సరస్సులోని నీటికి ఉన్న పోలికను వివరించారు. మన మనసు కూడా కొన్నిసార్లు ఆ సరస్సులోని నీటిలాగే ఉంటుంది. ఏదైనా సంఘటన జరిగినప్పుడు కోపం, బాధ, భయం, ఆందోళన వంటి భావోద్వేగాలు మన ఆలోచనలను గందరగోళానికి గురిచేస్తాయి. అలాంటి సమయంలో వెంటనే నిర్ణయాలు తీసుకుంటే తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. అదే కాసేపు ప్రశాంతంగా ఉండి, ఆలోచనలకు కొంత సమయం ఇస్తే పరిస్థితి స్పష్టంగా అర్థమవుతుంది.

కథలో నీతి

ఎలాగైతే నీటిలోని మట్టి కొంత సమయం తర్వాత కిందికి చేరి నీటిని స్వచ్ఛంగా మారుస్తుందో.. అలాగే మనసులోని గందరగోళం కూడా కొంత సమయం తర్వాత తగ్గిపోవచ్చు. ప్రతి సమస్యకు వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు. జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితికి మనం వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు. కోపంగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం, ఆందోళనలో ఉన్నప్పుడు చేసిన పని, బాధలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు తర్వాత పశ్చాత్తాపానికి కారణం అయ్యే అవకాశముంది. అందుకే మనసు కలత చెందినప్పుడు కాసేపు ఆగడం, ప్రశాంతంగా ఉండటం, పరిస్థితిని గమనించడం మంచిది.

మనసు గందరగోళంగా ఉన్నప్పుడు దాన్ని బలవంతంగా ప్రశాంతం చేయాలని ప్రయత్నించాల్సిన అవసరం లేదు. కొంత సమయం ఇవ్వండి. భావోద్వేగాలు క్రమంగా సద్దుమణిగిన తర్వాత మనసు స్పష్టంగా ఆలోచిస్తుంది. ప్రశాంతమైన మనసుతోనే జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *