Headlines

వాటర్ బాటిల్‌లో ఉండేదంతా స్వచ్ఛమైన నీరేనా.. తాగే ముందు ఇది కచ్చితంగా తెలుసుకోండి! | Is Bottled Water Really Safe? The Truth About Microplastics, Minerals and Quality Standards


మనం తాగేది స్వచ్చమైన నీరేనా.. వాటర్ బాటిలో నీట్‌గా కనిపించే నీటిలో నిజంగానే ప్యూటీ ఉందా.. బాటిల్‌పై ‘ప్యూర్’, ‘ప్యాకుడ్ డ్రింకింగ్ వాటర్’, ‘మినరల్ వాటర్’ వంటి పేర్లు కనిపిస్తే చాలామంది ఆలోచించకుండా తాగేస్తారు. కానీ నీటిలో ఉండే చాలా కాలుష్యాలు కంటికి కనిపించవు. నీరు రంగు లేకుండా, వాసన లేకుండా ఉన్నా అందులో ఫ్లోరైడ్, నైట్రేట్, కొన్ని లోహాలు, సూక్ష్మజీవులు లేదా అతి చిన్న ప్లాస్టిక్ కణాలు ఉండే అవకాశం ఉంది. అందుకే బాటిల్ నీరు ఎంత వరకు సురక్షితంగా తయారైంది. పరీక్షించారు. నిల్వ చేయచేశారనే ప్రశ్నలు వస్తున్నాయి.

బాటిల్ నీరు అంటే పూర్తిగా సురక్షితమేనా?

భారతదేశంలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌కు నాణ్యతా ప్రమాణాలు ఉన్నాయి. నీటిలో ఉండే రసాయనాలు, భారీ లోహాలు, సూక్ష్మజీవులు తదితర అంశాలను పరీక్షించాల్సి ఉంటుంది. FSSAI కూడా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌ను అధిక ప్రమాదం ఉన్న ఆహార వర్గంగా గుర్తించి తనిఖీలను కఠినతరం చేసింది.

అంటే బాటిల్ నీరు సురక్షితం కాదని కాదు. కానీ బాటిల్‌పై ఉన్న పేరు ఒక్కటే భద్రతకు హామీ కాదు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో ప్రమాణాలకు సరిపోని ప్యాకేజ్డ్ వాటర్ నమూనాలు కూడా బయటపడ్డాయి. అంటే మంచి బ్రాండ్లు, నాణ్యమైన తయారీ కేంద్రాలు ఉన్నట్లే, నాణ్యతలో లోపాలు ఉన్న ఉత్పత్తులు కూడా ఉండే అవకాశం ఉంది.

నీటిలో ప్లాస్టిక్ కూడా ఉందా?

ఇటీవలి సంవత్సరాల్లో నీటి గురించి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా చర్చకు వచ్చిన అంశం మైక్రోప్లాస్టిక్స్, నానోప్లాస్టిక్స్. మన కంటికి కనిపించని అతి చిన్న ప్లాస్టిక్ కణాలను మైక్రోప్లాస్టిక్స్ అంటారు. వాటికంటే ఇంకా చిన్నవాటిని నానోప్లాస్టిక్స్ అంటారు.

2024లో అమెరికాలోని పరిశోధకులు కొత్త పద్ధతితో బాటిల్ నీటిని పరీక్షించగా గతంలో గుర్తించలేని చాలా చిన్న ప్లాస్టిక్ కణాలు కూడా బయటపడ్డాయి. కొన్ని నమూనాల్లో లీటరుకు లక్షల సంఖ్యలో కణాలు ఉన్నట్లు నివేదికలు వచ్చాయి. ఇది విన్న వెంటనే బాటిల్ నీరు విషం అని చెప్పడం మాత్రం సరైంది కాదు. ఎందుకంటే ఈ కణాల్లో ఎంత భాగం మన శరీరంలోకి వెళ్తుంది, వెళ్లిన తర్వాత ఏమవుతుంది, దీర్ఘకాలంలో ఎంత ప్రమాదం కలుగుతుంది అనే విషయాలపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధారాలతో తాగునీటిలోని మైక్రోప్లాస్టిక్స్ వల్ల పెద్ద ఆరోగ్య ప్రమాదం ఉందని నిర్ధారించలేమని, అయితే మరింత పరిశోధన అవసరమని చెబుతోంది. అంటే మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయన్న విషయం నిజం. వాటి దీర్ఘకాలిక ప్రభావం ఎంత అన్నది ఇంకా పూర్తిగా తెలియదు.

ఆంధ్రప్రదేశ్‌లోనూ పరిశోధన

మైక్రోప్లాస్టిక్స్ సమస్య విదేశాల్లో మాత్రమే లేదని మన దగ్గర జరిగిన పరిశోధనలు కూడా సూచిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి ప్రాంతంలో బాటిల్ నీటిపై జరిగిన ఒక అధ్యయనంలో కూడా మైక్రోప్లాస్టిక్ కణాలు గుర్తించారు.అయితే వివిధ పరిశోధనల్లో కనిపించే సంఖ్యలు ఒకేలా ఉండవు. కారణం పరీక్షించే పద్ధతి, పరికరాల సామర్థ్యం, ఎంత చిన్న కణాలను లెక్కించారు అనే అంశాలు మారుతూ ఉంటాయి. అందువల్ల సోషల్ మీడియాలో కనిపించే “ఒక బాటిల్‌లో ఇన్ని లక్షల ప్లాస్టిక్ కణాలు” అనే సంఖ్యను చూసి భయపడటం కంటే, ఆ పరిశోధన ఎలా జరిగిందో కూడా చూడాలి.

ఎండలో పెట్టిన బాటిల్ ఎందుకు మంచిది కాదు?

సాధారణంగా కారులో, బస్సులో లేదా దుకాణం బయట ఎండలో ఉన్న నీటి బాటిళ్లు చూస్తాం. అధిక వేడి, ఎక్కువకాలం నిల్వ వంటి పరిస్థితుల్లో ప్లాస్టిక్ నుంచి కొన్ని పదార్థాలు లేదా సూక్ష్మకణాలు నీటిలోకి చేరే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. దీంతో ఒక్కసారి ఎండలో ఉన్న బాటిల్ తాగితే వెంటనే అనారోగ్యం వస్తుందని కాదు. కానీ ఎండలో గంటల తరబడి ఉన్న బాటిల్ నీటిని ప్రతిరోజూ తాగే అలవాటు ఎందుకు చేసుకోవాలి? అనేది మనం ఆలోచించాల్సిన విషయం. అందుకే బాటిల్ నీటిని చల్లగా ఉంచడం మాత్రమే కాదు, నేరుగా ఎండలో పెట్టకుండా ఉండటం కూడా ముఖ్యం.

నీటిలో ప్లాస్టిక్ కంటే పెద్ద సమస్యలు

మైక్రోప్లాస్టిక్స్‌పై చర్చ ఎక్కువగా జరుగుతున్నప్పటికీ, మన దేశంలో తాగునీటికి సంబంధించిన పాత సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో భూగర్భజలాల్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంటుంది. మరికొన్ని చోట్ల నైట్రేట్ సమస్య ఉంటుంది. పరిశ్రమల కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో సీసం, ఆర్సెనిక్ వంటి భారీ లోహాలు కూడా ఆందోళన కలిగించే అంశాలు. ఇక నీటిని శుద్ధి చేసిన తర్వాత కూడా నిల్వ చేసే ట్యాంకులు శుభ్రంగా లేకపోతే సూక్ష్మజీవులు పెరిగే అవకాశం ఉంది. అంటే నీటి సమస్య కేవలం బాటిల్ సమస్య కాదు. నీటి మూలం నుంచి మన గ్లాసు వరకు ప్రతి దశ ముఖ్యం.

బోర్‌వెల్ నీరు మంచిదా? బాటిల్ నీరు మంచిదా?

మన పరిశీలనలోని కొన్ని ల్యాబ్ నమూనాల్లో బోర్‌వెల్ నీటిలో TDS, hardness, fluoride వంటి కొన్ని విలువలు ప్యాకేజ్డ్ వాటర్ కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఒక నమూనాలో బ్యాక్టీరియా సంఖ్య కూడా ఎక్కువగా కనిపించింది. కానీ దీని అర్థం బోర్‌వెల్ నీరు అంతా చెడ్డది, బాటిల్ నీరు అంతా మంచిదని కాదు.

ఒక ప్రాంతంలోని బోర్‌వెల్ నీరు చాలా నాణ్యంగా ఉండవచ్చు. మరో ప్రాంతంలోని బోర్‌వెల్ నీటిలో ఫ్లోరైడ్ లేదా నైట్రేట్ ఎక్కువగా ఉండవచ్చు. అదే విధంగా మంచి నాణ్యతా నియంత్రణ ఉన్న బాటిల్ నీరు సురక్షితంగా ఉండవచ్చు. నాణ్యత లోపించిన ప్యాకేజ్డ్ వాటర్ సమస్యాత్మకంగా ఉండవచ్చు.

మరి ఏ నీరు తాగాలి?

సాధ్యమైనంత వరకు పరీక్షించిన, ప్రమాణాలకు అనుగుణమైన నీటినే తాగాలి. ఇంట్లో బోర్‌వెల్ నీరు వాడుతుంటే కాలానుగుణంగా నీటిని పరీక్షించాలి. ముఖ్యంగా ఫ్లోరైడ్, నైట్రేట్, ఇనుము, TDS, hardness వంటి అంశాలతో పాటు అవసరమైతే భారీ లోహాలు, బ్యాక్టీరియా కూడా పరీక్షించాలి. మున్సిపల్ నీరు అయితే ఇంటి ట్యాంక్ పరిశుభ్రతను కూడా పట్టించుకోవాలి.

RO పెట్టుకోవాలనుకుంటే ముందుగా నీటిలో సమస్య ఏమిటో తెలుసుకోవడం మంచిది. ప్రతి ఇంటికీ RO తప్పనిసరి కాదు. ప్రయాణాల్లో లేదా సురక్షితమైన నీరు అందుబాటులో లేని సందర్భాల్లో మంచి నాణ్యత గల ప్యాకేజ్డ్ వాటర్ ఉపయోగపడుతుంది.

ఒక లీటర్ ప్యాకేజ్‌డ్ వాటర్‌లో ఏముంటుంది?

మన చేతిలో ఉండే ఒక లీటర్ ప్యాకేజ్‌డ్ వాటర్ బాటిల్‌లో ప్రధానంగా H₂O (నీరు) ఉంటుంది. బరువు పరంగా చూస్తే నీటిలో సుమారు 88.8% ఆక్సిజన్, 11.1% హైడ్రోజన్ ఉంటాయి. మిగిలిన అతి స్వల్ప పరిమాణంలో కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, బైకార్బొనేట్, క్లోరైడ్ వంటి ఖనిజాలు, అయాన్లు ఉంటాయి. వాటి పరిమాణం నీటి మూలం, శుద్ధి విధానం, బ్రాండ్‌ను బట్టి మారుతుంది. అందుకే ప్రతి బాటిల్ నీటిలో ఖనిజాల శాతం ఒకేలా ఉండదు. బాటిల్‌లో కనిపించేది నీరే.. కానీ ఆ నీటి ప్రతి చుక్కలో రసాయన శాస్త్రం దాగి ఉంటుంది!

బాటిల్ కొనేటప్పుడు.. జాగ్రత్తలు

బాటిల్ కొనేటప్పుడు పెద్దగా శాస్త్రవేత్త కావాల్సిన అవసరం లేదు. కొన్ని సాధారణ విషయాలు గమనిస్తే చాలు. బాటిల్ సీల్ సరిగ్గా ఉందా చూడాలి. లేబుల్, తయారీ వివరాలు ఉన్నాయా చూడాలి. దెబ్బతిన్న, మురికిగా ఉన్న లేదా ఎక్కువకాలం ఎండలో ఉన్న బాటిల్ తీసుకోకపోవడం మంచిది. ఇంటికి తెచ్చిన బాటిల్‌ను కూడా ఎండలో పెట్టకూడదు.

ఒక్కసారి వాడి పారేయాల్సిన PET బాటిల్‌ను నెలల తరబడి నీటి సీసాగా ఉపయోగించడం కంటే, పునర్వినియోగం కోసం తయారు చేసిన మంచి నాణ్యత గల వాటర్ బాటిల్ ఉపయోగించడం మంచిది. 20 లీటర్ల వాటర్ క్యాన్ల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. క్యాన్ పరిశుభ్రంగా ఉందా, మూత సరిగా ఉందా, లేబుల్ ఉందా, నీటి మూలం నమ్మదగినదా అనే విషయాలు చూడాలి.

మనం భయపడాల్సింది ఏమిటి?

బాటిల్ నీటిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. మైక్రోప్లాస్టిక్స్‌పై పరిశోధనలు కొనసాగుతున్నాయి. నీటిలో అవి గుర్తించబడుతున్నాయి. వాటి దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావాలపై శాస్త్రవేత్తలు మరింత పరిశోధన చేస్తున్నారు. అదే సమయంలో ఫ్లోరైడ్, నైట్రేట్, భారీ లోహాలు, సూక్ష్మజీవుల వంటి పాత నీటి కాలుష్య సమస్యలను కూడా మర్చిపోకూడదు.

అందుకే నీటి విషయంలో మనకు కావాల్సింది భయం కాదు.. అవగాహన. బాటిల్‌పై ఉన్న బ్రాండ్‌ను మాత్రమే నమ్మకుండా, నీటి మూలాన్ని తెలుసుకోవాలి. సాధ్యమైనప్పుడు నీటిని పరీక్షించాలి. బాటిల్‌ను ఎండలో ఉంచకూడదు. ఇంటి నీటి ట్యాంకులను శుభ్రంగా ఉంచాలి. అవసరాన్ని బట్టి సరైన శుద్ధి పద్ధతిని ఎంచుకోవాలి.

నీరు పారదర్శకంగా కనిపిస్తే అది స్వచ్ఛమైనదని అర్థం కాదు. బాటిల్ సీల్ బాగుంటే అది పూర్తిగా సురక్షితమని కూడా అర్థం కాదు. నీటి అసలు నాణ్యత తెలుసుకోవాలంటే పరీక్షే మార్గం. ఈ నీరు ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా శుద్ధి చేశారు? ఎలా పరీక్షించారు? ఎలా నిల్వ చేశారు?” అదే నిజమైన ప్రశ్న. నీటిని చూసి కాదు.. పరీక్షించి తాగాలి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *