Headlines

‘వైకల్యాన్ని మార్చలేకపోయినా.. పట్టుదలతో తలరాతను మార్చుకోవచ్చు’ ఈ Topper కథ మీకు చెప్పాలి..


‘వైకల్యాన్ని మార్చలేకపోయినా.. పట్టుదలతో తలరాతను మార్చుకోవచ్చు’ ఈ Topper కథ మీకు చెప్పాలి..

ఛత్తీస్‌గఢ్‌, ఆగస్ట్‌ 16: ఛత్తీస్‌గఢ్‌లోని కల్యాణ్‌పుర్‌ గ్రామానికి చెందిన శీతల నలుగురు పిల్లల్లో ఒకరు. మిగతా పిల్లలకు ఎలాంటి సమస్యలు లేకపోయినా.. శీతల రెండు చేతులు, ఒక కాలు లేకుండా జన్మించింది. దీంతో చిన్న చిన్న పనులకు కూడా ఇతరులపై ఆధారపడాల్సి వచ్చేది. ఆమె భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందేవారు. అయితే శీతలకు ఏ లోటూ రాకూడదని, మిగతా పిల్లలతో సమానంగా పెంచాలని ఆమె తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు.

చదువుకోవాలన్న కోరికను శీతల తండ్రి హీరాలాల్‌ ప్రోత్సహించారు. స్కూల్‌కు వెళ్తానని శీతల చెప్పినప్పుడు తొలుత కొంత సందేహించినా.. ఆమె పట్టుదలను చూసి ప్రోత్సహించారు. కాలి వేళ్లతో పెన్సిల్‌ పట్టుకుని రాయడం నేర్పించారు. అక్షరాలను సరిగ్గా రాయడం నేర్చుకోవడానికి ఆమెకు దాదాపు ఆరు నెలలు పట్టింది. ఆ తర్వాత వీల్‌చైర్‌లో పాఠశాలకు వెళ్లడం ప్రారంభించింది. శీతల చదివిన ప్రభుత్వ పాఠశాల ఆమె ఇంటికి సుమారు రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆమె తల్లి కొంత దూరం వరకు తీసుకెళ్లేవారు. మిగతా దారిని స్నేహితుల సహాయంతో పాఠశాలకు చేరుకునేది. చదువుతో పాటు బొమ్మలు వేయడం, వీల్‌చైర్‌లోనే డ్యాన్స్‌ చేయడం, వ్యాసరచన వంటి కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనేది.

పదో తరగతిలో 92 శాతం

తన వైకల్యాన్ని బలహీనతగా భావించని శీతల.. చదువులోనూ అద్భుత ప్రతిభ కనబరిచింది. పదో తరగతి పరీక్షల్లో 92 శాతం మార్కులు సాధించి పాఠశాల టాపర్‌గా నిలిచింది. అంతేకాదు, జిల్లా స్థాయి టాప్‌ ర్యాంకుల్లోనూ స్థానం సంపాదించింది. ఆమె పట్టుదల, ప్రతిభను చూసి గ్రామస్థులతో పాటు ఎంతోమంది స్ఫూర్తి పొందుతున్నారు.

‘IAS కావాలన్నదే లక్ష్యం’

భవిష్యత్తులో సివిల్‌ సర్వెంట్‌ కావాలన్నది శీతల కల. ఐఏఎస్‌ సాధించి ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య, ఆరోగ్యం అందేలా పనిచేయాలని ఆమె కోరుకుంటోంది. తనలాంటి వారికి కూడా పట్టుదలతో ప్రయత్నిస్తే జీవితంలో మార్పు సాధ్యమేనని నిరూపించాలనుకుంటోంది. ‘వైకల్యాన్ని మార్చలేకపోయినా.. పట్టుదలతో ప్రయత్నిస్తే మన తలరాతను మాత్రం మార్చుకోవచ్చు’ అనే శీతల మాటలు ఆమె ఆత్మవిశ్వాసానికి అద్దం పడుతున్నాయి. శీతల పట్టుదల, ప్రతిభను గుర్తించిన సూరజ్‌పుర్‌ కలెక్టర్‌.. ఆమెకు ప్రభుత్వ పథకాల ద్వారా అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. వైకల్యాన్ని బలంగా మార్చుకుని లక్ష్యం వైపు అడుగులు వేస్తున్న శీతల నిజంగా ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *