Headlines

27 సార్లు ఫెయిల్.. అయినా వెనక్కి తగ్గలేదు.. AI దిగ్గజంగా ఎదిగిన హైదరాబాద్ కుర్రాడి కథ | 27 Rejections Couldn’t Stop Him: Hyderabad’s Soumith Chintala Becomes AI World Leader

27 సార్లు ఫెయిల్.. అయినా వెనక్కి తగ్గలేదు.. AI దిగ్గజంగా ఎదిగిన హైదరాబాద్ కుర్రాడి కథ | 27 Rejections Couldn’t Stop Him: Hyderabad’s Soumith Chintala Becomes AI World Leader


హైదరాబాద్‌, జులై 29: హైదరాబాద్‌లో జన్మించిన సౌమిత్ చింతల చిన్నతనంలో వారి ఇంట్లో కంప్యూటర్ కూడా ఉండేది కాదు. తొలిసారి పొరుగింట్లో కంప్యూటర్ చూసినప్పుడే దానిపై ఆసక్తి పెంచుకున్నాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివిన ఆయన, వెల్లూరులోని సాంకేతిక విద్యాసంస్థలో ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. ప్రముఖ విద్యాసంస్థల్లో చదవకపోయినా తన లక్ష్యాన్ని మాత్రం ఎప్పుడూ చిన్నదిగా భావించలేదు. ఉన్నత విద్య కోసం అమెరికాలోని విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేయగా వరుసగా 27 చోట్ల రిజెక్షన్ ఎదురైంది. అయినా ధైర్యం కోల్పోకుండా ప్రయత్నాలు కొనసాగించాడు. చివరకు న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం సాధించి, ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త యాన్ లెకన్ గైడెన్స్‌లో కృత్రిమ మేధస్సుపై పరిశోధనలు చేశాడు.

చదువు పూర్తయిన తర్వాత కూడా సౌమిత్‌కు సులభంగా అవకాశాలు రాలేదు. అనేక ఉద్యోగ దరఖాస్తులు రిజెక్షన్‌కు గురయ్యాయి. వీసా సమస్యల కారణంగా కొంతకాలం అమెరికా విడిచి వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఎదురైంది. అయినప్పటికీ నిరాశ చెందకుండా తన ప్రతిభను మరింత మెరుగుపరుచుకుంటూ అవకాశాల కోసం నిరంతరం ప్రయత్నించాడు. ఆ పట్టుదలే చివరకు అతని జీవితాన్ని మలుపుతిప్పింది. 2014లో ప్రపంచ ప్రఖ్యాత సామాజిక మాధ్యమ సంస్థ మెటాలోని AI రీసెర్చ్ టీంలో చేరిన సౌమిత్, పరిశోధకులు, విద్యార్థులు, సాంకేతిక నిపుణులు సులభంగా AI నమూనాలను రూపొందించుకునేందుకు ఉపయోగపడే ప్రముఖ స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ పైటార్చ్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించాడు. నేడు ప్రపంచవ్యాప్తంగా వేలాది పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థలు అదే వ్యవస్థను ఉపయోగిస్తున్నాయి.

దాదాపు పదకొండు సంవత్సరాల పాటు ఆ సంస్థలో సేవలందించి అత్యున్నత పదవికి ఎదిగిన సౌమిత్, ప్రస్తుతం కృత్రిమ మేధస్సు రంగంలో కొత్త ఆవిష్కరణల కోసం పనిచేస్తున్న ప్రముఖ సంస్థ Thinking Machinesలో ప్రధాన సాంకేతిక అధికారి బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. భవిష్యత్తు కృత్రిమ మేధస్సు దిశను నిర్ణయించే బృందంలో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు. సౌమిత్ చింతల కథ ప్రతి విద్యార్థికి, ప్రతి ఉద్యోగార్థికి ఒక గొప్ప సందేశం ఇస్తుంది. విజయాన్ని నిర్ణయించేది చదివిన కళాశాల పేరు కాదు… ఎదురైన తిరస్కరణల సంఖ్య కాదు. నేర్చుకోవాలనే తపన, కష్టపడే నిబద్ధత, ఓటమిని విజయానికి మెట్టుగా మార్చుకునే పట్టుదల ఉంటే అసాధ్యం అనుకున్న లక్ష్యాలు కూడా సాకారం అవుతాయి. ఒక తిరస్కరణ మీ జీవితానికి ముగింపు కాదు… అది మరింత గొప్ప విజయానికి ఆరంభం మాత్రమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *