సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక రియల్ ఎస్టేట్ వీడియో ఈ విషయంపై కొత్త చర్చను రేకెత్తించింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో రియల్ ఎస్టేట్ ధరలు ఎంత ఆకాశాన్ని తాకుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోట్ల రూపాయలు వెచ్చించినా నచ్చిన ఇల్లు దొరకడం గగనంగా మారే పరిస్థితులు ఉన్నాయి. అయితే, తాజాగా ఒక విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి సంబంధించిన నిబంధన సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది.
రూ. 6.5 కోట్ల ఫ్లాట్.. వింత షరతు!:
ముంబైలోని ప్రముఖ ప్రాంతమైన మలాడ్‌లో ఉన్న ఒక లగ్జరీ ఫ్లాట్‌ను రూ. 6.5 కోట్లకు అమ్మకానికి పెడుతున్నట్లు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఇన్స్టాగ్రామ్‌లో వీడియోను పంచుకున్నారు. ఆ ఇంట్లోని అత్యాధునిక సౌకర్యాలు, విశాలమైన గదులను చూపిస్తూనే, యజమానులు విధించిన ఒక షరతును ఆయన బహిరంగంగా వెల్లడించారు. ఈ ఫ్లాట్‌ను కేవలం పూర్తి శాకాహారులకు మాత్రమే విక్రయిస్తామని, మాంసాహారులకు అమ్మే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత:
ఈ వీడియో వైరల్‌గా మారిన వెంటనే నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముంబై లాంటి భిన్న సంస్కృతులు, భిన్న ప్రాంతాల ప్రజలు నివసించే అంతర్జాతీయ నగరంలో ఆహార అలవాట్ల ఆధారంగా ఇళ్లను విక్రయించడం సరైన పద్ధతి కాదని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇది ఒక రకమైన వివక్షేనని, కోట్ల రూపాయలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఆహారం ఆధారంగా అవకాశం నిరాకరించడం సరికాదని కామెంట్లలో అభిప్రాయపడుతున్నారు.
ముంబై రియల్ ఎస్టేట్‌లో పాత సమస్యేనా?:
వాస్తవానికి ముంబైలోని కొన్ని కొన్ని నిర్దిష్ట ప్రాంతాలు, సొసైటీలలో కేవలం ఒకే రకమైన ఆహార అలవాట్లు లేదా సమాజానికి చెందిన వారికే ఇళ్లను అద్దెకు ఇవ్వడం లేదా విక్రయించడం కొత్తేమీ కాదు. గతంలోనూ అద్దె ఇళ్ల విషయంలో ఇలాంటి వార్తలు వచ్చినప్పటికీ, రూ. 6.5 కోట్ల విలువైన భారీ ఫ్లాట్ విషయంలో బహిరంగంగా ఇలాంటి నిబంధన విధించడం మళ్లీ చర్చకు దారితీసింది. చట్టప్రకారం అందరికీ సమాన అవకాశాలు ఉండాలని ఒక వర్గం వాదిస్తుంటే, ఇల్లు తమది కాబట్టి నచ్చిన నిబంధనలు విధించే హక్కు యజమానులకు ఉంటుందని మరొక వర్గం చెబుతోంది. ఏది ఏమైనా ఈ వివాదం ప్రస్తుతం ముంబై రియల్ ఎస్టేట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
వీడియో ఇక్కడ చూడండి..
ही मुंबई मराठी माणसाची आहे. आगरी-कोळी बांधवांची आहे. महाराष्ट्राच्या कष्टकरी, सर्वसामान्य माणसाची आहे.
आणि मुंबईत कोणी काय खावं, काय खाऊ नये हे ठरवणारे तुम्ही कोण?माणूस मच्छी, मटण किंवा चिकन खातो म्हणून त्याला घर नाकारणं ही फक्त घर देण्याची मनमानी नाही ही उघड सामाजिक भेदभावाची… pic.twitter.com/84k06soddf
— Shubham Karpe | शुभम करपे (@ShubhamKarpe10) August 12, 2026
ఈ వీడియోకు దాదాపు 3 లక్షల వ్యూస్ లభించాయి.
ఈ వీడియో సోషల్ మీడియాలో దాదాపు 3 లక్షల వీక్షణలు, 1,600కు పైగా కామెంట్లను పొందింది. అయితే, మాంసాహారులకు ఇళ్లు అద్దెకు ఇవ్వకూడదనే నిబంధన నిజమైన హౌసింగ్ సొసైటీ నియమమా లేక ఆస్తిని అమ్ముకోవడానికి ఉపయోగించే ఎత్తుగడనా అనే విషయాన్ని రియల్ ఎస్టేట్ ఏజెంట్ స్పష్టం చేయలేదు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..