Headlines

CM Chandrababu: కరవు సీమకు కృష్ణమ్మ పరుగులు.. వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభించిన సీఎం | AP CM Chandrababu Inaugurates Veligonda Project Phase 1: Drinking Water, Irrigation Boost for Prakasam


వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం తన జీవితంలో భావోద్వేగ సందర్భమని చంద్రబాబు పేర్కొన్నారు. 1996 మార్చి 5న ముఖ్యమంత్రిగా తానే ఈ ప్రాజెక్టుకు భూమిపూజ చేశానని, సరిగ్గా 30 ఏళ్ల తర్వాత 2026 ఆగస్టు 31న ప్రాజెక్టు మొదటి దశను ప్రారంభిస్తున్నానని చెప్పారు. ఆ రోజు చేసిన సంకల్పం.. ఈ రోజు నల్లమల సాగర్‌లో జలసిరిగా మారిందని ఆయన అన్నారు. ఇది భగీరథ ప్రయత్నం.. కొండలు అడ్డు వచ్చినా తొలిచి ముందుకు వెళ్లాం, కరువు నేలకు కృష్ణమ్మను తీసుకొచ్చాం. శ్రీశైలం మల్లన్న సన్నిధి నుంచి బయలుదేరిన కృష్ణమ్మ.. మార్కాపురం చెన్న కేశవుడు కొలువైన నేలకు జలహారతి ఇస్తోందని తెలిపారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతోనే వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించుకుని జల సిరులతో ఈ ప్రాంత అభివృద్ధికి రెక్కలు తొడిగామన్నారు. వెలిగొండ బంగారు కొండ అవుతుందని.. ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. మార్కాపురం గడ్డకు, కరువుతో పోరాడిన రైతన్నలకు, ఫ్లోరైడ్‌ బాధలు భరించిన కుటుంబాలకు, నీటి కోసం ఎదురు చూసి అలసిపోయిన తరాలకు కృష్ణా జలాలతో కొత్త ఊపిరి ఇస్తున్నాం అని సీఎం అన్నారు.

నిర్వాసితుల త్యాగాలకు పాదాభివందనం

వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు, గ్రామాలను త్యాగం చేసిన 11 గ్రామాల ప్రజలకు పాదాభివందనం చేస్తున్నానని సీఎం అన్నారు. రైతుల త్యాగం లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపుతోందన్నారు. ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందేవారు ఎంత సంతోషంగా ఉంటారో.. నిర్వాసితులు కూడా అంతే సంతోషంగా ఉండాలి. కేవలం 48 రోజుల్లో 6,206 నిర్వాసిత కుటుంబాలకు రూ.768 కోట్ల పరిహారం అందించాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ నిర్వాసితుల బాధలు, అవసరాలను గుర్తించి అదనంగా మరో రూ.169 కోట్లు చెల్లిస్తున్నామన్నారు. కటాఫ్‌ తేదీని పెంచి 18 ఏళ్లు నిండిన యువతకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున అందించామని తెలిపారు.

రూ.10,200 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టులో ఇప్పటివరకు రూ.7,983 కోట్లు ఖర్చు చేసి మొదటి దశను పూర్తి చేశాం. 18.8 కిలోమీటర్ల మేర జంట సొరంగాలు, 21.8 కిలోమీటర్ల ఫీడర్‌ కాలువల పనులు పూర్తి అయ్యాయి. తొలిదశలో భాగంగా నల్లమల సాగర్‌కు 10.70 టీఎంసీల నీటిని తరలిస్తామన్నారు. 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతుంది. వెలిగొండ పూర్తయితే ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందుతుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 3.36 లక్షల ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 84 వేల ఎకరాలు, కడప జిల్లాలో 27 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.

తీగలేరు కాలువ కింద 62 వేల ఎకరాలు, గొట్టిపడియ కాలువ కింద 9,500 ఎకరాలు, తూర్పు ప్రధాన కాల్వ కింద 3.70 లక్షల ఎకరాల ఆయకట్టు సుస్థిరం అవుతుంది. కృష్ణమ్మ రాకతో పశ్చిమ ప్రకాశంలో ఫ్లోరైడ్‌ అనే పదం గత చరిత్రగా మిగిలిపోతుంది. వెలిగొండ అంటే ఫ్లోరైడ్‌ కష్టాలకు ముగింపు. కరువు నేలపై కృష్ణమ్మ రాసిన కొత్త చరిత్ర అని ముఖ్యమంత్రి అభివర్ణించారు.

మార్కాపురంలోనూ 2028 కృష్ణా పుష్కరాలు

వెలిగొండ ప్రాజెక్టు మొత్తం పూర్తికావడానికి మరో రూ.1,900 కోట్ల పనులు చేయాల్సి ఉందని చంద్రబాబు తెలిపారు. వెలిగొండ ఫేజ్‌-2ను కూడా 2028 నాటికి పూర్తి చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ప్రకటించారు. మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేశామని, రాయలసీమ హార్టీకల్చర్‌ హబ్‌లో మార్కాపురాన్ని భాగం చేశామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని సమానంగా అభివృద్ధి చేయడమే ఎన్డీఏ విధానమని, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి సాధిస్తామని స్పష్టం చేశారు.

దేశం ఎదుర్కొంటున్న నీటి సమస్యలకు నదుల అనుసంధానమే పరిష్కారమని చంద్రబాబు అన్నారు. పోలవరం రాష్ట్రానికి జీవనాడి అని, 2027 మార్చి నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను అనకాపల్లికి తరలిస్తున్నామని, తదుపరి వంశధార వరకూ తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. దక్షిణ భారతదేశంలో గోదావరి-కావేరి అనుసంధానం జరగాలని, మహానది-గంగానదులను అనుసంధానిస్తే దేశం సుభిక్షంగా మారుతుందని ఆకాంక్షించారు. వచ్చే మూడేళ్లలో 36 ప్రాజెక్టులను పూర్తి చేసేలా ఇరిగేషన్‌ క్యాలెండర్‌ రూపొందించామని చెప్పారు. ప్రతి వర్షపు నీటి చుక్కను పొదుపు చేసి భూగర్భజలంగా మార్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

2028లో జరిగే కృష్ణా పుష్కరాలను మార్కాపురంలోనూ వైభవంగా నిర్వహించుకుందామని చంద్రబాబు అన్నారు. గోదావరి జలాలు నల్లమల సాగర్‌ వరకూ రావాలని, అందుకోసం ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని తెలిపారు. ఓట్లు ఆశించి కాదు.. మార్పు ఆశించి పనిచేస్తున్నామని.. ఎన్నికల కోసం కాదు.. ప్రజల జీవితాలను మార్చేందుకు, భవిష్యత్‌ తరాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *