
ఉమెన్స్ ఆసియా కప్ 2026 తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో క్రికెట్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. లీగ్ దశలోనే మూడు విజయాలు నమోదు చేసి సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్న టీమిండియా.. ప్రస్తుతం టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా కనిపిస్తోంది. అయితే ఆటతో పాటు సెప్టెంబర్ 13న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ట్రోఫీ ప్రదానోత్సవంపైనా ఆసక్తి పెరుగుతోంది.
ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఫైనల్‌కు ముఖ్య అతిథిగా హాజరై విజేత జట్టుకు ట్రోఫీ అందించే అవకాశం ఉందన్న వార్తలు ఈ చర్చకు కారణమయ్యాయి. ఒకవేళ భారత మహిళల జట్టు ఫైనల్‌కు చేరుకుని టైటిల్ సాధిస్తే.. నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ స్వీకరిస్తుందా లేదా అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఈ సందేహాలకు గత ఏడాది జరిగిన పురుషుల టీ20 ఆసియా కప్ పరిణామాలే నేపథ్యంగా నిలిచాయి. ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం సాధించిన సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు టైటిల్ గెలుచుకుంది. అయితే ఆ సమయంలో నఖ్వీ చేతుల మీదుగా విజేత ట్రోఫీ, పతకాలు స్వీకరించేందుకు భారత జట్టు నిరాకరించింది. ఆటగాళ్లు వ్యక్తిగత అవార్డులు మాత్రమే తీసుకుని, ప్రధాన ట్రోఫీ ప్రదాన కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.
ఈ పరిణామంతో నఖ్వీ ట్రోఫీని తీసుకుని స్టేడియం నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఆ ట్రోఫీని తిరిగి పొందేందుకు బీసీసీఐ ప్రయత్నించినప్పటికీ, అది ఏసీసీ వద్దే ఉందన్న సమాచారం వెలువడింది. ఇప్పుడు మహిళల టోర్నీలో భారత్ ఫైనల్ చేరితే ఇదే తరహా పరిస్థితి మరోసారి ఎదురవుతుందా అనే చర్చ మొదలైంది. అయితే ప్రస్తుతం భారత మహిళల జట్టు ఇంకా ఫైనల్ బెర్త్‌ను అధికారికంగా ఖరారు చేసుకోలేదు. ఒకవేళ టైటిల్ పోరులో విజయం సాధిస్తే.. ట్రోఫీ ప్రదానోత్సవంలో భారత ఆటగాళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై అధికారికంగా భారత జట్టు లేదా బీసీసీఐ నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.