స్వర్ణాంధ్రప్రదేశ్.. పేరుకు తగ్గట్టే స్వర్ణమయం కాబోతోంది. ఒకప్పుడు కరువుతో అల్లాడిన సీమలో ఇప్పుడు బంగారు భాండాగారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దశాబ్దాలుగా చరిత్ర పుటల్లోనే మిగిలిపోయిన గోల్డ్ మైన్స్… ఇప్పుడు మళ్లీ కొత్త ఆశలకు పునాది వేస్తున్నాయి. ఒకప్పుడు మూతపడిన గనులు… ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బూస్టప్ ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. భూమి పొరల కింద దశాబ్దాలుగా ఉన్న అపారమైన సంపద, ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. ఇది కేవలం ఖనిజ సంపద గురించే కాదు, ఒక రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తును మార్చే అవకాశాల కథ. పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి, అభివృద్ధి, ఇలా ఎన్నో ఆశలకు వారధిగా ఉంది. దేశ బంగారు ఉత్పత్తి రంగంలో ఆంధ్రప్రదేశ్ నూతన చరిత్ర సృష్టిస్తోంది. కర్నూలు జిల్లా జొన్నగిరిలో ఇప్పటికే భారీ బంగారు నిక్షేపాలను వెలికితీసే పనులు అధికారికంగా ప్రారంభంకాగా, తాజాగా చిత్తూరు జిల్లాలోనూ పెద్ద ఎత్తున పసిడి నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. ఈ పరిణామాలు రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి సరికొత్త ఊపునిస్తున్నాయి. జొన్నగిరిలో అత్యాధునిక టెక్నాలజీతో బంగారాన్ని వెలికితీసే ప్రక్రియ విజయవంతంగా సాగుతుండగా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా జరిపిన సర్వేల్లో విలువైన ఖనిజ ఆనవాళ్లు బయటపడ్డాయి. త్వరలోనే ఇక్కడ కూడా తవ్వకపు పనులు మొదలయ్యే అవకాశం ఉంది. కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం ఉత్పత్తి తర్వాత, రాష్ట్రంలోని ఇతర బంగారు గనులపై కూడా ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని రామగిరి గోల్డ్ మైన్స్‌ను పరిశీలించింది ఏపీ సర్కార్. సుమారు పాతికేళ్ళ తరువాత రామగిరి కొండల్లో మళ్ళీ పసిడి కాంతులు కనిపించనున్నాయి. బ్రిటిష్ కాలంలోనే రామగిరి కొండల్లో బంగారు నిక్షేపాలు ఉన్నాయని తవ్వకాలు జరిపారు. తర్వాత 1972లో భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం బంగారు తవ్వకాలు ప్రారంభించింది. 1982 నుంచి 2002 వరకు రామగిరి గోల్డ్ మైన్స్ నుంచి బంగారం ఉత్పత్తి జరిగింది. అయితే అప్పట్లో శుద్ధి చేయగా వచ్చిన బంగారం కంటే… బంగారాన్ని ఉత్పత్తి చేసేందుకు అయ్యే ఖర్చు ఎక్కువగా ఉండటంతో… భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ తీవ్ర నష్టాల్లోకి వెళ్లింది. 2002 తర్వాత భారత్ గోల్డ్ మైన్స్ మూతపడింది. మళ్లీ ఇప్పుడు రామగిరి గోల్డ్ మైన్స్ కు మంచి రోజులు వచ్చాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బయటపడిన భారీ బంగారు నిక్షేపాలను వేలంలో దక్కించుకునేందుకు ఏపీఎండీసీ పావులు కదుపుతోంది. గుడిపల్లి మండలం చిగురుగుంట-బి.సానత్తం బంగారు గనులపై ప్రత్యేక దృష్టి సారించిన సంస్థ, ఈ-వేలంలో పాల్గొనాలని భావిస్తోంది. మరోవైపు, వేలం ప్రక్రియ లేకుండా ఈ గనులను నేరుగా ఏపీఎండీసీకి కేటాయించాల్సిందిగా కేంద్రాన్ని కోరే అంశంపై కసరత్తు చేస్తోంది. ఈ గనులపై పట్టు చిక్కితే.. స్థానిక ఆర్థిక వ్యవస్థ బలపడటంతో పాటు భారీగా ప్రయోజనం చేకూరనుంది. చిత్తూరుతో పాటు జవకుల, రామగిరి, బొక్సంపల్లి ప్రాంతాల్లోని బంగారు నిక్షేపాలపై కూడా అధికారులు దృష్టి సారించారు. స్వర్ణ కుప్పం కావాలనేది తన ఆకాంక్ష అని.. కుప్పంలో త్వరలోనే బంగారం ఉత్పత్తి చేసి.. ‘స్వర్ణ కుప్పం’ అనే పేరును సార్థకం చేస్తామని చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం చిగురుగుంట-బి.సానత్తంలో భారీగా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక్కడ 22 లక్షల టన్నుల బంగారు ఖనిజ నిల్వలున్నట్లు అంచనా వేస్తున్నారు. టన్ను ఖనిజాన్ని తవ్వితీసి శుద్ధిచేస్తే సగటున 5.64 గ్రాముల బంగారం వస్తుంది. మొత్తమ్మీద 12,500 కిలోల బంగారాన్ని వెలికితీయొచ్చునని భావిస్తున్నారు. గతంలో భారత్ గోల్డ్ మైన్స్ ఆధ్వర్యంలో తవ్వకాలు జరగగా, ఖనిజాన్ని కర్ణాటకలోని కోలార్ గోల్డ్ మైన్స్ ప్రాంతానికి తరలించి శుద్ధి చేసేవారు. రవాణా ఖర్చులు పెరగడం, అప్పట్లో బంగారం ధర తక్కువగా ఉండటంతో 2000-2001లో తవ్వకాలను ఆపేసి గనులను మూసేశారు. 2018లో ఈ-వేలంలో ఎన్ఎండీసీ వీటిని దక్కించుకున్నప్పటికీ, కోర్టు కేసుల కారణంగా జాప్యం జరిగింది. 2022లో అనుకూలంగా తీర్పు వచ్చినా, పర్యావరణ అనుమతులు తదితర కారణాలతో ఎన్ఎండీసీ వెనక్కి తగ్గి లీజును వదులుకుంది. వాస్తవానికి చిగురుగుంట గోల్డ్ మైన్స్ చరిత్ర దశాబ్దాల కిందటే ప్రారంభమైంది. గుడిపల్లె మండలంలోని రెండు ప్రాంతాల్లో బంగారం గనులున్నట్లు గుర్తించింది. బి.సానత్తంలోని గనిని 1968లో, చిగురుగుంటలోని గనిని 1978లో ప్రారంభించారు. ఎంఈసీఎల్ సంస్థ సారథ్యంలో తవ్వకాలు మొదలుపెట్టి క్వార్ట్జ్ రాయిని వెలికితీస్తూ వచ్చారు. సుమారు పదేళ్ల పాటు ఈ ముడి పదార్థాన్ని కేజీఎఫ్‌లోని బీజీఎంఎల్ సంస్థకు అందించారు. కాలక్రమేణా ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఎంఈసీఎల్ గనులను 1982లో బీజీఎంఎల్‌కు విక్రయించింది. అప్పటి నుంచి 2001 జనవరి 15 వరకు బీజీఎంఎల్ ముడి ఖనిజాన్ని వెలికితీసింది. అయితే, కేజీఎఫ్‌లోని మరో గని నష్టాల్లో పడటంతో దాని ప్రభావం చిగురుగుంట, బి.సానత్తం గనులపై కూడా పడింది. దీంతో కంపెనీ లాకౌట్ ప్రకటించడంతో గనులు మూతపడి వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. చిగురుగుంట మైనింగ్‌కు సంబంధించి మరిన్ని వివరాలను మా స్పెషల్ కరస్పాండెంట్ రాజు అందిస్తారు. కర్నూలు జిల్లా జొన్నగిరిలోని గనిలో విజయవంతంగా ఉత్పత్తి మొదలవటంతో అందరి దృష్టి బంగారు గనులపై పడింది. చిగురుగుంట-బి.సానత్తం గనులకు టెండర్లు పిలిచారు. అధిక నిక్షేపాలున్న ఈ లీజును ఏపీఎండీసీ దక్కించుకొని బంగారం వెలికితీయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వీటి ఈ-వేలంలో పాల్గొనేందుకు ఏపీఎండీసీ సిద్ధమై, రూ.37 కోట్ల బ్యాంక్ గ్యారంటీ చెల్లించేందుకు ఏర్పాట్లు చేసుకుంది. జూలై నెలాఖరు వరకు బిడ్ల దాఖలుకు అవకాశముండగా, బిడ్ దక్కితే ఏదైనా సంస్థతో జాయింట్ వెంచర్‌గా ఏర్పడి బంగారు నిక్షేపాల తవ్వకాలు చేపట్టాలని ప్రణాళిక రూపొందించింది. బంగారం, బొగ్గు, బాక్సైట్ వంటి మేజర్ మినరల్స్‌ను వేలం ద్వారా కేటాయిస్తుండగా, ప్రభుత్వరంగ సంస్థలైనప్పటికీ వేలంలో పాల్గొనే లీజులు పొందాల్సి వస్తోంది. ఇటీవల తెలంగాణలో రెండు బొగ్గు బ్లాక్‌లకు వేలం లేకుండా సింగరేణికి నేరుగా రిజర్వ్ చేయడం, ఒడిశాలో ఓ బాక్సైట్ లీజును ఆ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో చిగురుగుంట-బి.సానత్తం గనులను ఏపీఎండీసీకి రిజర్వ్ చేయాలని కేంద్రాన్ని కోరేందుకు ఏపీ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. అంతేకాకుండా శ్రీసత్యసాయి జిల్లా రామగిరిలో రెండు వేల హెక్టార్లలోని ఉత్తర, దక్షిణ బ్లాక్‌లు, రొద్దం మండలం బొక్సంపల్లిలో 1,740 హెక్టార్లలో ఉత్తర, దక్షిణ బ్లాక్‌లు, ఎన్పీ కుంట మండలం జవకులలో 5,560 హెక్టార్లలో ఏ, బీ, సీ, డీ, ఈ, ఎఫ్ బ్లాకుల్లో బంగారు ఖనిజాన్వేషణ లైసెన్స్‌లనూ ఏపీఎండీసీకి రిజర్వ్ చేయాలని కోరనుంది. ఒకప్పుడు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ప్రపంచాన్ని ఆకర్షించాయి. ఇప్పుడు జొన్నగిరి, రామగిరి, చిగురుగుంట పేర్లు కూడా అదే స్థాయిలో వినిపించే రోజులు వస్తాయంటున్నారు పాలకులు. భూమి అడుగున ఉన్న బంగారు సంపద… ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త బలంగా మారబోతోందంటున్నారు. పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే… వేలాది మందికి ఉపాధి… వందల కోట్ల పెట్టుబడులు… ప్రభుత్వానికి భారీ ఆదాయం… రాయలసీమకు కొత్త పారిశ్రామిక రూపం తీసుకురావచ్చంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఘాటెక్కిన వంటిల్లు..భగ్గుమంటున్న నిత్యావసర సరుకుల ధరలు
Viral Video: గడ్డికోస్తున్న గొర్రెలు.. ఎక్కడంటే ?
వైన్స్‌లోకి దూసుకొచ్చిన చిరుత.. క్షణాల్లో అక్కడి వ్యక్తిని..
రిటైర్మెంట్ పొదుపు కోసం ఏది బెస్ట్ ?? మీకు సరిపోయే పొదుపు పథకం ఏది?
Auto Driver Love: నెటిజన్లను కదిలిస్తున్న ఆటోడ్రైవర్ ప్రేమకథా చిత్రం!