Headlines

JIO: జియో పదేళ్ల ప్రస్థానం.. ఎన్నో మైలురాళ్లు.. మరెన్నో ఘనతలు.. | Jio Turns 10: How Reliance Jio Transformed Indias Telecom Sector and Digital Landscape


జియో.. ఈ పేరు తెలియనివారంటూ దేశంలో ఎవరూ ఉండరు. ప్రముఖ అగ్రగామి సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్‌ జియోతో టెలికాం రంగంలోకి ప్రవేశించి సంచలనాలకు వేదికైంది. జియో ప్రవేశంతో దేశంలో టెలికాం రంగంలో అనేక పెను మార్పులు చోటుచేసుకున్నాయి. దేశంలో మొబైల్ నెట్‌వర్క్ రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. అన్‌లిమిటెడ్ కాల్స్, తక్కువ ధరకే డేటా ప్యాక్‌లు జియోతోనే ప్రారంభమయ్యాయి. మార్కెట్లోకి అడుగుపెట్టిన కొన్ని రోజుల్లోనే జియో దేశంలోనే నెంబర్ వన్ టెలికాం సంస్ధగా అవతరించింది. తక్కువ ధరకే రీఛార్జ్ ప్యాక్‌లు, ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఇక 5జీ నెట్‌వర్క్‌ దేశమంతటా విస్తరిస్తూ జియో కస్టమర్లను మరింత ఆకట్టుకుంటోంది. సెప్టెంబర్ 5తో జియో తన పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోనుంది.

2016 సెప్టెంబర్ 5న రిలయన్స్ జియో తన కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభించింది. దీంతో ఈ సెప్టెంబర్ 5తో సరిగ్గా దశాబ్దం పూర్తి చేసుకుంటుంది. జియో రాకముందు కాల్స్ , మొబైల్ డేటా అత్యంత ఖరీదైనవిగా ఉండేవి. కాల్స్ లేదా డేటా కావాలన్నా టాప్ అప్ ప్యాక్‌లు ఉండేవి. దీంతో మొబైల్ వాడాలంటే రీఛార్జ్‌లకు ఎక్కువ ఖర్చు అయ్యేది. కానీ జియో వచ్చాక అన్‌లిమిటెడ్ టారిఫ్ ప్లాన్లు అందుబాటులోకి వచ్చాయి. ఒక్క రీచార్జ్‌తో అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవడంతో పాటు అదే ప్యాక్‌లో డేటా కూడా తక్కువ ధరకు లభిస్తుంది. జియో వచ్చిన తర్వాత డేటా ప్యాక్‌లు చౌక ధరకే లభించడం మొదలైంది. దీంతో జియోతో పోటీగా మిగతా టెలికాం కంపెనీలు కూడా తక్కువ ధరకు డేటాను అందించడం మొదలుపెట్టాయి. ఈ కారణంతో దేశంలో ప్రతీఒక్క స్మార్ట్‌ఫోన్ యూజర్‌ తక్కువ ధరకు డేటాను ఉపయోగిస్తున్నారు. జియో రాకతోనే ఇది సాధ్యమైందని చెప్పవచ్చు.

గతంలో ఒక జీబీ డేటాకు సుమారు రూ.228 వరకు ఖర్చు అయ్యేది. జియో ఎంట్రీతో తక్కువ ధరకే హైస్పీడ్ డేటా అందుబాటులోకి రావడంతో.. దేశంలో మొబైల్ ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోయిందని చెప్పవచ్చు. దేశంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా జియో అత్యధిక సబ్‌స్కైబర్లతో దూసుకెళ్తుంది. 2026 జూన్ నాటికి ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో సబ్‌స్క్రైబర్లు 3.258 కోట్లకు చేరుకున్నారు. ఏపీ సర్కిల్‌లో జియో 36.9 శాతం మార్కెట్ షేర్‌తో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక 5జీ సేవల్లో కూడా ఈ సంస్థ వేగంగా దూసుకెళ్తుంది. జియో 2022 చివరిలో 5జీ సేవలను ప్రారంభించగా.. కేవలం 15 నెలల్లో దేశవ్యాప్తంగా 5జీ కవరేజీని విస్తరించింది. కేవలం 42 నెలల్లో సుమారు 26.8 కోట్ల 5జీ కస్టమర్లను సొంతం చేసుకుంది. కేవలం మొబైల్ నెట్ వర్క్‌తో ఆగిపోకుండా హోమ్ బ్రాడ్‌బ్యాండ్ రంగంలో కూడా జియో తన సత్తా చాటింది. తక్కువ ధరకే బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తూ ఆ రంగంలో కూడా తన హవా కొనసాగుతోంది. 2026 మార్చి 31 నాటికి జియో హోమ్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్ల సంఖ్య 2.7 కోట్లకు చేరుకుంది. దేశవ్యాప్తంగా 2026 నాటికి జియోకు 52.44 కోట్ల యాక్టివ్ కస్టమర్లు ఉన్నారు. హోమ్ బ్రాడ్‌బ్యాండ్,, క్లౌడ్, ఎంటర్‌ప్రైజ్ నెట్‌వర్క్‌లు, ఐఓటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో కూడా జియో దూసుకెళ్తుంది.  త్వరలో జియో ఐపీఓకు కూడా సిద్దమవుతోంది. దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా ఇది రికార్డు సృష్టించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *