CWG 2026 : 2026 కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత దేశపు పతకాల ఖాతా అధికారికంగా తెరుచుకుంది. ఏ ఆటగాడి పేరునైతే సమాజం ఒకప్పుడు గేలి చేసి, ఎటకారంగా నవ్విందో.. అదే క్రీడాకారుడు ఇప్పుడు భారత్ జెండాను అంతర్జాతీయ స్థాయిలో సగర్వంగా ఎగురవేశాడు. కామన్‌వెల్త్ క్రీడల్లో భారత తొలి పతక విజేతగా జండు కుమార్ పేరు మైదానంలో మారుమోగినప్పుడు, అది కేవలం ఒక బ్రాంజ్ మెడల్ గెలుపు ప్రకటన మాత్రమే కాదు.. ఆయన జీవితంలోని నిరంతర పోరాటం, పడిన అవమానాలు, అంతులేని ఆత్మవిశ్వాసానికి దక్కిన చారిత్రాత్మక విజయం.
పారా పవర్‌లిఫ్టింగ్‌లో మెరిసిన బీహార్ తేజం
బీహార్ రాష్ట్రానికి చెందిన 28 ఏళ్ల పారా పవర్‌లిఫ్టర్ జండు కుమార్ శుక్రవారం జరిగిన పురుషుల హెవీవెయిట్ విభాగంలో అద్భుత ప్రదర్శన కనబరిచారు. మొత్తం 130.9 పాయింట్లతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుని దేశానికి కీర్తి తెచ్చారు. పోటీలో భాగంగా ఆయన 181 కిలోలు, 190 కిలోల బరువును ఎంతో సునాయసంగా ఎత్తగా, 196 కిలోల బరువును ఎత్తే చివరి ప్రయత్నం దురదృష్టవశాత్తు విఫలమైంది. ఈ చివరి ప్రయత్నం కనుక పూర్తయి ఉంటే పతకం రంగు మారి గోల్డ్ దక్కేది.
సంతోషంతో నిద్ర కరువైంది: జండు కుమార్
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) ఏర్పాటు చేసిన ప్రత్యేక సంభాషణలో జండు కుమార్ తన ఆనందాన్ని పంచుకున్నారు. “పతకం గెలిచాననే సంతోషం ఎంత ఎక్కువగా ఉందంటే, నిన్న రాత్రి నుంచి నాకు నిద్ర కూడా పట్ల లేదు. పడుకున్నా సరే కళ్లు మూతపడటం లేదు” అని చెప్పారు. చివరి ప్రయత్నంలో పతకం రంగు మారకపోవడంపై ఆయనకు ఎలాంటి బాధ లేదు. “మొదటి ప్రయత్నంలో సురక్షితమైన బరువును ఎత్తాను. లేకపోతే ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. రెండోది మెడల్ ఖాయం చేసుకునేందుకు, మూడోది గోల్డ్ మెడల్ కోసం ప్రయత్నించాను. సాంకేతిక పొరపాటు, శ్వాస సరిగ్గా తీసుకోకపోవడం వల్ల స్వర్ణం మిస్సయింది” అని స్పష్టం చేశారు.
ఐదేళ్ల వయసులోనే పోలియో శాపం
జండు కుమార్ ఎదుర్కొన్న కష్టాలు ఈ క్రీడా ప్రాంగణంలో మొదలైనవి కావు. ఐదేళ్ల చిన్న వయసులోనే పోలియో బారినపడి ఆయన శారీరక వైకల్యానికి గురయ్యారు. ఒకానొక దశలో చేతుల సహాయంతో కింద కూర్చునే నడవాల్సి వచ్చేది. “దివ్యాంగుడిగా మారిన నన్ను చూసి.. వీడు అసలు ఏం చేయగలడు? వీడి వల్ల ఏమవుతుంది?” అంటూ చుట్టుపక్కల వారు ఎగతాళిగా మాట్లాడేవారని జండు కుమార్ ఆవేదనగా గుర్తు చేసుకున్నారు.
జండు పేరు వెనుక ఉన్న కన్నీటి కథ
ఆయన పేరు జండు కుమార్ కావడం వెనుక ఎంతో వేదన దాగి ఉంది. ఆయన చిన్నతనంలో పోలియో వైద్యం కోసం కుటుంబం ఉన్న ఆస్తిపాస్తులన్నీ అమ్మేసి ఖర్చు చేసింది. ఆ సమయంలో తండ్రి పరిచయస్తులు “మీ కొడుకు మీ ఆస్తిని అంతా జండు (పాడైపోవడం/శూన్యం) చేశాడు, డబ్బులన్నీ బూడిదలో పోసిన పన్నీరు చేశాడు” అని దెప్పిపొడిచారు. ఆ తూలనాడులే కాలక్రమేణా ఆయన అసలు పేరుగా మారిపోయాయి. ఒక దశలో తన పేరును అవినాష్ కుమార్‌గా మార్చుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, ప్రభుత్వ ఆఫీసుల్లో అధికారులు పాత కాగితాలు చూసి జండు కుమార్ అని పిలుస్తూ నవ్వేవారు. “ప్రజలు నా పేరు చూసి నవ్వి సంతోషిస్తే.. ఈ పేరే నాకు సరైనది అని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నా అన్ని సర్టిఫికేట్లలో జండు కుమార్ అనే ఉంది, అవినాష్ అనే పేరు ఉనికిలోనే లేదు” అని గర్వంగా చెప్పారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..